హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరెంటు కష్టాలకు చెరమగీతం పాడిన రాష్ట్రం తెలంగాణ నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్నిరంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పేందుకు నేను గర్విస్తున్నాను.. సంతోషిస్తున్నాను.
రాష్ట్రం ఏర్పడిన విద్యుత్ కోతలతో, పవర్ హాలీడేలతో మనం ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలుసు. రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగిన స్థాపిన విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్లలో 74 మెగావాట్ల నుంచి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఇప్పుడది 2012 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73శాతం అధికంగా ఉన్నది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు.. తాగునీటికి తల్లడిల్లాయి. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టిపీడించేది. చిన్నవయసులోనే నడుము వంకరపోవడం, బొక్కలు విరగడం, కాళ్లు వంకర తిరగడం వంటి సమస్యలతో నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని సాధించింది. నేడు రాష్ట్రంలోని వందశాతం ఆవాసాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షిత మంచినీరు సరఫరా కావడం నాకు సంతోషంగా ఉన్నది. అతితక్కువ బృహత్తరమైన పథకాన్ని పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది.
ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలు పరిచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం తీరుతెన్నులను పరిశీలించి వెళ్లడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటి కోసం మహిళలు బారులు తీరిన దృశ్యాలు, మంచినీటి యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తిని తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం’ అన్నారు.