హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనతి కాలంలోనే తెలంగాణ.. అన్ని రంగాల్లో అగ్రగామిగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశానికి దారి చూపే టార్చ్ బేరర్‌గా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. భారత్‌లో అంతర్భాగంగా మారిన తరువాత ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్‌ను, తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై దారుణ వివక్ష చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ సమాజం కృషి ఫలితమే..
తెలంగాణ రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజుకు గుర్తుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. ఇటీవలే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకొన్నాం. దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకొంటున్నాం. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసింది. నాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింది. తెలంగాణలో ఆనాడు ఎందరో యుద్ధం చేశారు.
ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు. మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం. జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, భూస్వాముల ఆగడాలకు బలైన దొడ్డి కొమురయ్య, తన సొంత భూమి వందల ఎకరాలను పేదలకు పంచిన త్యాగశీలి రావి నారాయణరెడ్డి, పీవీ నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థ, తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహించిన సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్‌స్వామి, భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ,
మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, జనగామ సింహం నల్లా నర్సింహులు, గీత కార్మికుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, ప్రజా పోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవి, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వేంకటేశ్వరరావు, అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడు బద్దం ఎల్లారెడ్డి, నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం. ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారు. వారందరి ఉజ్వల స్మృతికి శిరస్సు వంచి నమసరిస్తున్నా.
అన్ని రంగాల్లో అగ్రగామి..
తెలంగాణ ప్రజలు భయపడినట్టుగానే సమైక్య రాష్ట్రంలో దారుణ వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమ శంఖం పూరించాను. 14 ఏండ్లు అవిశ్రాంత పోరాటం చేశాం. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో.. అదేవిధంగా నేడు అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అద్భుతాలను ఆవిషరించి దేశానికే దిశానిర్దేశం చేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ రూ.5,05,849 కోట్లు, 2021-22 నాటికి అది రూ.11,54,860 కోట్లకు పెరిగింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104 కాగా, 2021-22 నాటికి రూ. 2,78,833కు పెరిగింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణం. సంపదను పెంచాలి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా రూ.50 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నది.
ఉద్యోగాల కల్పనలో కర్ణాటకను వెనక్కు నెట్టాం
ప్రశాంతమైన, సురక్షిత, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుంది. అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రం. సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆసారంలేని విధంగా రూపొందించిన టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం.. ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేండ్లలో రూ.2, 32,111 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి.
16.50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తున్నది. 2014లో తెలంగాణ ఐటీరంగ ఎగుమతుల విలువ రూ. 57,258 కోట్లు మాత్రమే ఉండగా, 2021 నాటికి రూ.1,83,569 కోట్లకు పెరిగింది. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 మాత్రమే ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతం. ఐటీ ఉద్యోగాల సృష్టిలో మొన్నటివరకూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. ఈ ఎనిమిదేండ్లలో ఐటీ రంగంలో 7.80 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. మప పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నాడు కరువు కాటకాలు.. నేడు సస్యశామలం
తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన ఆరునెలల వ్యవధిలోనే అన్ని రంగాలకు 24 గంటలు నిర్విరామంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు అందుబాటులోకి తెచ్చింది. నేడు దేశంలో అన్నిరంగాలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గర్వకారణం. ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగించింది. కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది.
పంటల దిగుబడి విపరీతంగా పెరిగి దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లా ద్వారా ఉచితంగా అందిస్తూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గురుకుల విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం. 1,011 గురుకులాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ గురుకులాల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ఒకో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతిఏటా రూ.1,25,000 ఖర్చు చేస్తున్నది.
వైద్య రంగంలో అద్భుతం
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వరంగల్‌లో మరో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మరో రెండువేల పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వీటితోపాటు పేదల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు చకని సేవలందిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకం తెలంగాణకు హరితహారం. గత ఏడేండ్లలో ఈ పథకం వల్ల పచ్చదనం 7.7 శాతం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేరొన్నది. ప్రపంచంలోనే మొదటిసారి హరిత నిధిని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించింది.