ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి సాధించేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎన్నో జీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. అటువంటి కష్టం తెలంగాణకు పొరపాటున కూడా మళ్లీ రావొద్దు. ఇప్పుడు మతతత్వ శక్తులు బయల్దేరి వికృతచర్యలతో తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. చైతన్యంతో అప్రమత్తంగా ఉండాలె. అశాంతికి, అలజడికి అవకాశమివ్వొద్దు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న మతతత్వ శక్తులను తిప్పి కొట్టాలని తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం.. ఈ మతతత్వ శక్తుల వికృత ప్రయత్నాలతో చీలిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి నీచమైన క్రీడలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.. ప్రసంగం కేసీఆర్ మాటల్లోనే..
అప్రమత్తంగా ఉండాలి
ఎనిమిదేండ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చకని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకొంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి.
58 ఏండ్లు శాపగ్రస్త జీవితం
ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి సాధించేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది. ఎన్నో జీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమంతా ప్రత్యక్ష భాగస్వాములమే. హకుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన సంఘర్షణను తలచుకుంటే నేటికీ నా కండ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి.
బుద్ధి కుశలత చూపే సమయం
అత్యంత మేధో సంపత్తి, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకొన్నది. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికీ మించి మీ బిడ్డగా ఈ విషయం చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత.
మరో కల్లోలంలోకి జారిపోవద్దు
మీ అందరికీ వినమ్రంగా చేతులు జోడించి నమసరిస్తూ నేను కోరుకునేది ఒకటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతే వేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దాం అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉపన్యాన్ని ముగిస్తూ సీఎం కేసీఆర్ వేద శ్లోకాన్ని వినిపించారు.
ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహైతేజస్వినా వధీతమస్తు మావి ద్విషావహై, ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
మనం పరస్పరం కాపాడుకుందాం..
లోకంలోని సంపదను సమంగా అనుభవిద్దాం..
మనం వీరులమై, పరాక్రమశీలురమై జీవిద్దాం..
మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం..
మనం విద్వేషాలను విడనాడి, విశ్వశాంతిని సాధిద్దాం..
జై హింద్ జై తెలంగాణ
పెట్రేగిపోతున్న మతోన్మాద శక్తులు
దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పెట్రేగి పోతున్నాయి. సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మత చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే దేశ, రాష్ట్ర జీవికనే కబళిస్తుంది. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడభూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.