CM KCR | పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ చెబుతుందని.. కరెంటు కాటగలుస్తుంది జాగ్రత్త అంటూ రైతులు, ప్రజలను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ‘నిన్నగాక మొన్నం మేనిఫెస్టో విడుదల చేశాం. పెన్షన్ ఇస్తే ఓట్ల కోసం లంగమాటలు చెప్పలే. సంసారం చేసినట్లు.. ఎట్లైతే మంచిగనడుస్తదో అట్ల చేసుకుంటుపోయాం.
రైతుల కోసం పట్టుపట్టి.. జట్టుగట్టి చెట్టుకొకరు.. గుట్టకొకరు అయ్యారు కాబట్టి నా రైతుబిడ్డలు. బొంబాయి వలసపోయారు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవరూ చెప్పకుండా నేను డిజైన్ చేసిందే.. నేను పుట్టించిందే రైతుబంధు పథకం. ఈ పథకం ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడా లేదు. ఇవాళ నెత్తిమాసినోడు వచ్చి అడ్డంపొడువు మాట్లాడుతరు. ఎప్పుడైనా రైతుబంధు అనే స్కీమ్ విన్నమా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు విన్నమా? గొడగొడ ఎడిస్తే కూడా పట్టించుకోలే’ అని గుర్తు చేశారు.
‘ఎనకట పటాకులు కాలినట్లు కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే. బోరుకు రూ.2వేల లంచాలు.. ట్రాక్టర్లపై పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత వెల్లదీసినమో తెలుసు. నేను కాపోడినే.. నేను రైతునే. ఇప్పుడు నేను కూడా వ్యవసాయం చేస్తున్నకాబట్టి రైతుల సమస్యలు. కావాలని రైతుల కోసం రైతుబంధు తెస్తే ఇవాళ.. తెలంగాణ, పాలమూరు రైతులు జరజర మొఖాలు తెల్లగైతున్నయి. అప్పుల బాధ తీర్సుకుటున్నరు. రూ.37వేలకోట్ల రుణాలు మాఫీ చేశాం.
ఇంకో పదేళ్లు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుంది. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో గెలిచింది. ఆడ ఏం డైలాగులు కొట్టిన్రు. 20 గంటల కరెంటు ఇస్తమన్నరు. నిన్న కర్నాటక ముఖ్యమంత్రి ఐదుగంటలు ఇస్తం సగవెట్టుకొన్రి.. ఎవడి గొంగలివాడే అని. అది కూడా తెల్లందాక సగం.. పొద్దాక సగం.. ఇండ్ల పండాలా? బాయికాడ పండల్నా? అని ప్రజలను సీఎం కేసీఆర్ ప్రశ్నించగా.. 24 గంటల కరెంటు కావాలంటూ నినదించారు.
‘ఈ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులో ఉన్న మాట కక్కిండు. రైతులకు ఎందుకుయ్యా.. కేసీఆర్ అనవసరంగా 24గంటలు కరెంటు ఇస్తుండు. మూడు గంటలు ఇస్తే సరిపోతది అంటుండు. మూడు గంటలు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలా? మూడు గంటల కరెంటు కావాలా?. కాంగ్రెస్గిట్ల వస్తే మళ్లీ కాటగలుపుతరు. భారతదేశం మొత్తంలో 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రధానికి కూడా చేతనైనత లేదు. గుజరాత్లో రోడ్లపై పడి గడబిడ చేస్తున్నరు.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్. కరెంటు కాటకలుస్తుంది. మళ్లీ మొదటికి వస్తుంది.. జాగ్రత్త అని మనవి చేస్తున్నా. ఇప్పుడు వచ్చి మస్తు చెబుతరు. ఎలక్షన్లు కాబట్టి గోల్మాల్ తిప్పాలని అడ్డం పొడువు మాట్లాడుతరు. ఏది నిజమో.. ఏది కాదో ఆలోచించాలి. లక్ష్మారెడ్డి కోరిన కోరెలు నెరవేరుస్తాం. రెండు పోలీస్స్టేషన్లు కావాలని కోరాడు. ఎలక్షన్ల తెల్లారే జీవో జారీ చేస్తాం. ఉద్దండాపూర్ వాసులకు పరిహారం కూడా మంజూరు చేయిస్తాం.
ఎన్నింటికో బాధపడ్డ, గోసపడ్డ తెలంగాణ.. ఆగమైన తెలంగాణ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లక్ష్మారెడ్డి కష్టపడే నాయకుడు. తొలిరోజు నుంచి ఉద్యమంలో ఉన్నడు. నేను రాజీనామా చేసిననాడు ఆయన రాజీనామా చేసిండు. ఉద్యమం ఆసాంతం నా వెంబడి ఉన్న నిఖార్సన నాయకుడు. లక్ష్మారెడ్డి మరోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి’ అని జడ్చర్ల ప్రజలకు పిలుపునిచ్చారు.