సిద్దిపేట : మల్లన్న సాగర్ ఒక్కటే కాదు.. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 70 టీఎంసీలు నిల్వ చేసే రిజర్వాయర్లు దగ్గర పడుతున్నాయి. 50 డిగ్రీల ఎండలో గోదావరి నదిలో ఇంజినీర్లు పడ్డ కష్టం వృథా కాలేదు. ఎంతో మంది ఎన్నో రకాల కష్టాలు పడి ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం.
కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశం మొత్తం కరువు ఉన్నా తెలంగాణలో కరువు రాదు. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటది అని ఉద్యమ సమయంలో ప్రశ్నించాను. ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటోంది. ఉద్యమ వేడిని చల్లార్చడానికి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ను ఇవాళ ప్రారంభించుకున్నాం. ఈ ప్రాజెక్టును నింపడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. 50 టీఎంసీల ప్రాజెక్టు కాబట్టి.. మూడు సంవత్సరాల నాటికి మొత్తం నింపేస్తారు. వ్యవసాయానికి నీళ్లు మాత్రం ఇస్తూనే ఉంటాం. ప్రస్తుతానికి 10.64 టీఎంసీల నీళ్లు తెచ్చాం. మరో 5 టీఎంసీలు తీసుకొచ్చి నింపుతారు. మళ్లీ వర్షకాలంలో ఈ ప్రాజెక్టును నింపుతారు. ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేనివారు, కొన్ని రాజకీయాల పార్టీల వాళ్లు ఆరోపణలు చేస్తారు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పారు.