జనగాం: దళిత బంధు కింద ఈ సంవత్సరం 40 వేల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేయనున్నామని.. సంవత్సరానికి రెండు మూడు లక్షల కుటుంబాలకు రైతు బంధును అందజేస్తామని వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకువస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జనగాంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఉద్యమం జరిగేటప్పుడే తాను తెలంగాణ వస్తే బాగుపడతామని.. ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పా అని గుర్తు చేశారు.
ఇప్పుడు వందకు వంద శాతం నేను చెప్పినట్టు జరుగుతోంది. దళితుల పేదరికం పోవాలి. శరీరంలో ఏ భాగం బాగలేకున్నా.. శరీరం బాగున్నట్టు కాదు. మీరందరూ చూస్తున్నారు. బయట చాలామంది కళ్లు మండుతున్నాయి. ఈ మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు వస్తుంది. దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇవ్వడమే కాదు.. మెడికల్ షాపుల ఓనర్లకు రిజర్వేషన్లు పెట్టాం. ఫర్టిలైజర్ షాపులకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ కాంట్రాక్ట్‌లో, బార్ షాపులలో కూడా రిజర్వేషన్లు పెట్టాం. ఇదివరకు బార్ షాపులు నిర్వహించే దళితులు లేరు. కానీ.. నేడు దళితులు కూడా బార్ షాపులు నిర్వహిస్తున్నారు. మీ కళ్ల ముందర అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. సమైక్య పాలకుల వల్ల నష్టపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడుతోంది. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా కింద 5 లక్షలు అందజేస్తున్నాం. ఎన్ని మోటర్లు ఉన్నాయి అని అడిగే వారు లేరు. జనగాంలో ఇదివరకు భూముల రేట్లు ఎలా ఉండే.. బచ్చన్నపేటలో లక్ష, రెండు లక్షలు ఉండేది. ఇప్పుడు 30 లక్షలకు కూడా జనగాం, బచ్చన్నపేటలో దొరుకుతలేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.