KCR | మహబూబ్‌నగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వికారాబాద్: కొడంగల్ గర్జించింది, పాలమూరు పరవశమైంది. పరిగి పిడికిలెత్తి నినదించగా, తాండూరు తాండవమాడింది.. ఆయా చోట్ల జరిగిన సీఎం కేసీఆర్, జననేత కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి. ఆయా సభలకు జనం వెల్లువలా తరలివచ్చారు. ఎక్కడికక్కడ గులాబీ జెండా రెపరెపలతో జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో, పరిగి, తాండూరు పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సభలకు జనం పోటెత్తారు. కోస్గిలోని వేంకటేశ్వర ఫంక్షన్‌హాలు పక్కనున్న గ్రౌండ్లో, పరిగి జింఖానా గ్రౌండ్లో, తాండూరులోని విలియం మూన్ గ్రౌండ్లో ఆయా సభలు జరిగాయి.
ఆయా నియోజకవర్గాల్లోని గ్రామగ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణాలు జనజాతరను తలపించాయి. సీఎం కేసీఆర్ ప్రసంగ సమయాల్లో ప్రజలు, గులాబీ శ్రేణులు ఈలలు, కేరింతలతో సందడి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున జనం హాజరవడంతో పాలమూరు పట్టణమంతా జనసంద్రమైంది. సభా ప్రాంగణమైన బాలుర కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. సామెతలు, చలోక్తులతో సీఎం కేసీఆర్ కొడంగల్ సహా ఇతర సభలను రక్తి కట్టించారు. తద్దినం ఉన్నదని భోజనం పెడితే మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలి అని, ఎందుకు పుట్టినవ్రా వంకరా.. అంటే సక్కగా ఉన్నోడిని వెక్కిరించనికే.. అన్న సామెతలతో కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నేతలను కేసీఆర్ విమర్శించడంతో జనం చప్పట్లతో కేరింతలు కొట్టారు. సభల్లో మిట్టపల్లి సురేందర్ కళాకరుల బృందాల ఆటపాటలతో జనం గంతులేసి ఆడిపాడారు.