హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): భాగ్యరెడ్డివర్మ దళిత వైతాళికుడని, దళితుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ 135వ జయంతిని పురసరించుకొని సోమవారం ఆయన నివాళులర్పించారు. మహనీయుడు భాగ్యరెడ్డివర్మను గౌరవించుకోవడంతోపాటు ఆయన స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించేందుకు జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల కోసం పాఠశాలలను స్థాపించి, వారి విద్యాభివృద్ధికి, ఉన్నతికి భాగ్యరెడ్డివర్మ గట్టి పునాదులు వేశారని చెప్పారు. భాగ్యరెడ్డివర్మ స్ఫూర్తితో ఎస్సీ కులాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ప్రగతి నిధి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అంబేదర్ ఓవర్సీస్ సాలర్షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.