హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగుచేసుకొందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్‌చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన పురోగతి దేశవ్యాప్తం కావాలని, ఆ దిశగా పోరాడేందుకు అందరి సహకారం కావాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మానవీయ విలువలతో పురోగతి
మనిషి తనను తాను ఏ విధంగా ప్రేమించుకొంటాడో.. పొరుగువాళ్లను, ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించటం అలవాటు చేసుకోమని సందేశం ఇచ్చిన దేవుని బిడ్డ జీసస్ క్రైస్ట్. క్రీస్తు బోధనలు తు.చ తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్ధం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండనే ఉండవు. ఒకమాటలో చెప్పాలంటే ప్రపంచంలో అసలు యుద్ధాలే జరగవు. నేరస్థులుగా పరిగణించి జైళ్లల్లో ఉండేవాళ్ల కోసం జైళ్లే అవసరం ఉండదు. నిజంగా ఏసుక్రీస్తు చెప్పిన ప్రపంచం.. ఆయన కలలుగన్న ప్రపంచం ఎంతో ఉదాత్తమైనది. ఉన్నతమైనది.
అది సాధించగలిగితే మనిషే దేవుడు అవుతాడు. తుదిశ్వాస విడిచేవరకు విశాలమైన ఈ భూ మి అంతా వసుధైక కుటుంబంలాగా ఉండాలని కాంక్షించిన మహోన్నతుడు ఏసుక్రీస్తు. మానవుడు పరిపక్వత సాధి స్తూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో ఇంకా పురోగమించాల్సిన అవసరం ఉన్నది. ఆలయాలు, చర్చిలు, మసీదులు, బౌద్ధ, జైన మందిరాలు మానవీయ విలువల పురోగతి, కరుణ, దయ వంటి గ్రేస్‌ఫుల్ జీవితం గురించి ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత మంచిది. క్రీస్తు జన్మించిన డిసెంబర్ మాసంలో మనందరం ఆయన ప్రవచించిన భావాలను అలవాటు చేసుకొని ఆచరించటానికి ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నంలో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా క్రీస్తు భగవానుడిని ప్రార్థిస్తున్నాను.
కార్డినల్ పూల ఆంథోని గర్వకారణం
కార్డినల్ పూల ఆంథోని బిషప్ స్థాయి నుంచి పైకి ఎదిగి పోప్‌ను ఎన్నుకొనే కార్డినల్స్లో భాగస్వామి కావడం తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణం. గత సంవత్సరం వారు ఇక్కడ బిషప్‌గా ఉండె. ఈ రోజు ప్రపంచలోనే ఉన్నతమైన కార్డినల్ స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రం తరఫున, భారతదేశం తరఫున పూల ఆంథోనికి ప్రత్యేక శుభాకాంక్షలు.
అన్ని పండుగలను గొప్పగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యావత్ సమాజం ముందుకు పురోగమించే అవసరం ఉన్నది. ఇది సందర్భం కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నా. 20 ఏండ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో భయయంకరమైన వివక్షకు గురి అవుతూ చిన్నబుచ్చుకొని ఉన్న తెలంగాణ సమాజాన్ని చూసి ‘జై తెలంగాణ’ నినాదంతో మనం యుద్ధం ప్రారంభించాం. ఆ రోజు అనేక మంది నాతోపాటు నడిచారు. చివకి విజయం సాధించాం. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా, సంతోషంగా మనవి చేస్తున్నా. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.
ఏడేండ్ల క్రితం మన తలసరి ఆదాయం లక్ష రూపాయలే ఉండె. అనేక పెద్దపెద్ద రాష్ర్టాలను అధిగమించి ఈరోజు మన తలసరి ఆదాయం రూ.2. 75 లక్షలు సాధించాం. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో, ఇంకా అనేక విషయాల్లో నంబర్ 1, నంబర్ 2 స్థానాలకు తెలంగాణ పురోగమించింది. తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయపథంలో ఎలా నిలబెట్టగలిగామో.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుత భారతావని నిర్మాణం కోసం అంకితం అవుదాం.
క్రైస్తవ మతపెద్దలతో త్వరలో సమావేశం
కొన్ని సమస్యల గురించి ఆంథోని, మంత్రి చెప్పారు. క్రైస్తవ మతపెద్దలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో త్వరలోనే సమావేశం నిర్వహించి జరగవలసిన పనుల గురించి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటాం. మరొక్కసారి ఈ పవిత్రమైన క్రిస్మస్ పండుగ సందర్భంగా యావత్ ప్రపంచంలోని క్రైస్తవ బిడ్డలందరికీ హ్యాపీ క్రిస్మస్.. మెర్రీ క్రిస్మస్, జై భారత్ అని సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు క్రైస్తవ మతపెద్దలు, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ వినతి పత్రం అందజేశారు.