హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఏసుక్రీస్తును స్తుతిస్తూ పాడిన పాటలతో మైదానం మార్మోగిపోయింది. వేడుకలకు రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 12 వేలకు పైగా క్రైస్తవులు తరలిరాగా, వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథ బాలలకు గిఫ్ట్ ప్యాక్‌లను అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరించడంతోపాటు కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ ట్రీని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మతపెద్దలకు తినిపించారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాజసేవ, సాహిత్యం, కళలు, క్రీడలు, విద్యా, వైద్యం మొదలైన రంగాల్లో 30 ఏండ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్న క్రైస్తవ సంస్థలకు, వ్యక్తులకు గౌరవ పురసారాలు, నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు సీఎం కేసీఆర్‌కు జ్ఞాపికను బహూకరించారు.
బహుమతుల కార్యక్రమం తర్వాత మతపెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం విందులో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీఎంవో అధికారులు, కార్డినల్ పూల ఆంథోనీ, పలువురు క్రైస్తవ మత సంఘాల పెద్దలు, బిషప్‌లు, ప్రభుత్వ మైనారిటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశానికే తెలంగాణ ఆదర్శం: కొప్పుల
తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని షెడ్యూల్డ్ కులాలు, మైనార్టీ సంక్షేమశాఖ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నదని, అన్ని పండుగలను అట్టహాసంగా, అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. లౌకికవాదానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిరూపంగా నిలుస్తున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ మరెన్నో కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి: కార్డినల్ పూల ఆంథోని
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని కార్డినల్ పూల ఆంథోని కొనియాడారు. అట్టడుగువర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అధికారికం గా నిర్వహించడంపై హర్షం ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.