హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కొనియాడారు. సంక్షేమ భవన్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవా రం ఆయన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటివరకు 23,204 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేశామని వివరించారు. వీరిలో 8,400 మంది లబ్ధిదారులు ఇప్పటికే తమ యూనిట్లను ప్రారంభించారని, ఈ నెలాఖరు నాటికి మరో 40 వేల మంది ఖాతాల్లో నగదు జమచేయనున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.64.21 కోట్లతో 11,380 మంది దళిత యువతకు నైపుణ్య శిక్షణ అందించామని, రూ.764.09 కోట్లతో 16,999 ఎకరాల భూములను కొనుగోలు చేసి 6,950 మంది దళితులకు అందజేశామని వివరించారు.
డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రవీంద్రభారతిలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.