హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటే రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతోంది. హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామనడంలో తప్పు లేదు. ఇస్తాంబుల్‌గా కావాలని కోరుకోవద్దా? ఇది కూడా అనుకోవద్దా? కలలు కనొద్దా? బారాబార్ చేసి చూపిస్తాం. వక్రీకరణలు చేయడం దుర్మార్గం. కరీంనగర్‌ను డల్లాస్ చేస్తామని చెప్పలేదు. రోప్ వే బ్రిడ్జి కావాలని మంత్రి గంగుల కమలాకర్ అడిగారు. కరీంనగర్ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయి. వాటిని సుందరంగా తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ డల్లాస్‌గా కనిపిస్తుందని చెప్పాను. అది తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
ఈ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసింది. మీరు చేసిన తప్పులను సవరించలేక చచ్చిపోతున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను రూపుదిద్దేందుకు రూ. 15 వేల కోట్లు కావాలని అధికారులు చెప్పారు. ఒక రోజులో అయ్యే పని కాదు.. దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.
హైదరాబాద్‌నే నేనే కట్టాను అని ఒకాయన చెబుతుండే. 400 ఏండ్ల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల ఉన్నాయి. అనేక కాన్ఫరెన్స్‌లు జరుగుతుంటాయి. మెగా మెట్రో సిటీలు.. ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. హైదరాబాద్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చాం. ఈ నగరాలను బాగు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ప్రతి ఏడాది రూ. 30 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతారు. ఈ ఐదు నగరాలను గొప్పగా చేయడానికి రూ. 50 వేల కోట్లు ఇవ్వాలని కోరాను. ఏడాదికి కేంద్రం రూ. 10 వేల కోట్లు, రాష్ట్రాలు రూ. 10 వేల కోట్లు కలిపి మొత్తంగా రూ. 20 వేలు కోట్లు ఖర్చు చేస్తే అవి ఒక పద్ధతికి వస్తాయని చెప్పాను. కానీ కేంద్రం నుంచి శూన్యం. స్పందన కూడా రాదు అని కేసీఆర్ మండిపడ్డారు.