హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబిస్తూ రూపొందించిన ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకం బాగున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలు, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఈ కాఫీటేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సచివాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో తీసుకొచ్చిన ఈ పుస్తకం చాలా బాగున్నదని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని చక్కగా వివరించారని ప్రశంసించారు. దీనిని అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులు, సుప్రీంకోర్టు, అన్ని రాష్ర్టాల హైకోర్టు జడ్జీలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అన్నిదేశాల రాయబారులు, రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, యూనివర్సిటీల వైస్‌చాన్సలర్లు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, చైర్మన్లు, రాష్ట్రంలోని సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు అందజేయాలని సూచించారు. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో కూడా కాఫీటేబుల్ పుస్తకం ఉండేలా చూడాలని చెప్పారు. పుస్తకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి అభినందించారు. పుస్తకంతోపాటు ఫిలిగ్రీ ఆర్ట్‌తో రూపొందించిన పెన్ను, బిద్రీఆర్ట్తో తయారుచేసిన గడియారాన్ని కూడా బహూకరిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ కోరెం అశోక్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు ముషార్రఫ్ అలీ, దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
Kcr3