హైదరాబాద్ : దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మనకు అర్థమైనటువంటి సారాంశం చర్చల రూపంలో, తీర్మానాలు చెప్పే సమయంలో అందరు కూడా మనం బాగుపడితే సరిపోదు. మన రాష్ట్రం కూడా ఉజ్వలంగా ఉండాలంటే.. దేశ రాజకీయాలు కూడా గొప్పగా ఉండాలని అందరు చెప్పారు. దాన్ని అనుసరించి తప్పకుండా భవిష్యత్‌లో రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకొని, మన పాత్ర ఎలా ఉండాల్నో ఆలోచించుకొని ముందుకుపోవడం జరుగుతుంది.
విజ్ఞానం అనేది ఎవరి వద్ద ఉండదు? ఎవరూ దానికి యజమానులు కాదు. అవసరమైన సమయంలో సముపార్జన చేసుకొని ముందుకు సాగాలి. దాని కోసం మీ అందరి అనుమతితో దేశ రాజకీయాలు, వ్యవస్థ, దేశ సమగ్ర స్వరూపం, ఉన్న వనరులేంటి? వసతులేంటి? అని 15-20 రోజుల పాటు దేశవిదేశాల్లో ఉన్న ఆర్థికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. అక్కడ చర్చలు జరుగుతయ్.. వాళ్లంతా తేలుస్తారు. మేధావులను పిలుస్తున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కొందరు ముందుకు వస్తున్నరు’ అని తెలిపారు.
అదేవిధంగా ఆలిండియా సర్వీస్ ఆఫీసర్‌గా పని చేసిన రిటైర్డ్ అయిన వారు 2వేల మంది వరకు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నాం. తెలియని విషయాలు తెలిసినట్లు నటించి భంగపాటుకు గురయ్యే బదులు ఏ కార్యం చేపట్టి, ఏ పని చేపట్టిన సమగ్ర దృక్పథంతో, ఆలోచనతో ముందుకు వెళ్లాలి. దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. వ్యక్తులు ప్రధానమంత్రులు కావడం, పార్టీలు మారి అధికారంలోకి రావడం ముఖ్యం కాదు.
75 సంవత్సరాల స్వాత్రంత్య్ర ఫలితం, ఉద్యమం ఆకాంక్షలు, ఆ సందర్భంలో ప్రజలు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు సాఫల్యం కాలేదని మనముందున్న భారతదేశం చెబుతున్నది. ఈ భారతదేశం రొటీన్ పొలిటికల్ సిస్టమ్ నుంచి, ఫ్రంట్లు, టెంట్ల బాధ నుంచి కొత్త పంథాలో ముందుకు పురోగమించడానికి ఏరకమైనటువంటి పద్ధతులు ఎంచుకోవాలని, ఎలాంటి స్ట్రక్చరర్ ఛేంజ్‌లు తీసుకురావాలి.. ఏరకమైన పాలసీలు రూపకల్పన జరగాలి. దేశంలో నీళ్లు ఉన్నయ్, కానీ రైతులకు రావు. దేశంలో కరెంటు ఉన్నది, దాన్ని వినియోగించే సత్తా దేశాన్ని పాలిస్తున్న పాలకులకు లేదు. మంచినీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం ప్రాథమిక అవసరాలు. ఇవి కూడా 75 ఏళ్లలో సమకూర్చలేని పరిస్థితి. ఈ పరిస్థితులు పోవాలంటే ఇక్కడో తీవ్రమైన లోపం ఉన్నది. పాలసీ తయారీ, అమలులో కొన్ని లోపాలున్నాయ్.
హిమాలయాలకు అవతలి వైపు చైనా ఉన్నది, మనం ఇటు వైపు ఉన్నాం. వాళ్లు అన్నమే తింటరు.. మనం అన్నమే తింటం. ఏం కథ అంటే వాళ్ల పాలసీలు వేరని చెబుతున్నరు. నేను ఒకట మాట అడిగిన. వాళ్ల పాలసీకి కంటే.. మన పాలసీ బెటరైతే మనమే చైనా కన్న ముందుండాలి కదా. ఉత్తమైందనుకుంటే రావాలి. వాళ్లు దూసుకుపోతున్నారు. 16 ట్రిలియన్ డాలర్ల దాటుతున్న.. మూడు ట్రిలియన్ డాలర్ల వద్ద మనం ఉన్నాం’ అన్నారు.