హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశం ఆశ్చర్యపడేలా త్వరలోనే ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని ఉద్యమ సమయంలోనే చెప్పాను. ఇచ్చి చూపిచ్చినం. మాకు మానవీయ దృక్పథం ఉన్నది. దేశంలో కాంగ్రెస్‌తోపాటు మరెవరూ ఇవన్నీ చేయలేదు. చిన్నచిన్న ఉద్యోగుల గురించి కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
మేం వాస్తవంలో చేసి చూపించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీ ఇస్తే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30% జీతాలు పెంచాం. దేశ చరిత్రలో ఇది తొలిసారి. శాసనసభలో పనిచేసే అవుట్సోర్సింగ్ వాళ్లకు కూడా 30% పెంచాం. కాంగ్రెస్, బీజేపీ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. కొద్దిరోజుల్లోనే పీఆర్సీ వేస్తాం. మళ్లీ పెంచుతాం. ఉద్యోగులు చెమటోడుస్తున్నరు. ఇంజినీర్ల పుణ్యంతో ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నయ్. అటవీశాఖ ఉద్యోగుల పుణ్యంతో వనాలు పెరుగుతున్నయ్. వ్యవసాయ అధికారుల పుణ్యంతో కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆయా శాఖలకు రూ.కోట్లు సంపాదిస్తున్నారు.
కమర్షియల్ టాక్స్ ఎక్కడ ఉండేది? ఎంత ఎత్తుకు ఎదిగింది! స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంత పెరిగింది! ఉద్యోగస్థులే చమటోడ్చి, కష్టించి పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నరు కాబట్టి, వాళ్ల సొమ్ములోనే వాళ్లకు కూడా కొంత వాటా ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టుకుంటున్నం. ఇప్పుడు మళ్లీ దేశం ఆశ్చర్యపడే పేస్కేల్ ఇస్తాం. ఉద్యోగులు కూడా మా పిల్లలే కదా. రాష్ట్రం ధనికంగా మారితే ఉద్యోగులు కూడా ధనికులు కావాలి. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తాం. రికమండేషన్‌ను అనుసరించి అద్భుతంగా పెంచుతాం. ఇప్పటికే 70% పెంచుకున్నాం. ఒకసారి 40%, ఇంకోసారి 30% పెంచాం. మళ్లీ ఇప్పుడు మంచి పర్సంటేజీ ఇస్తాం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.
మరో 7వేల మంది మౌజంలు, ఇమాంలకు నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ భృతి అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. ఆదివారం అసెంబ్లీలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మౌజంలు, ఇమాంలకు ఇప్పటికే నెలకు రూ.10 వేలు ఇస్తున్నాం. ఇంకా 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందరికీ సోమవారం ఉత్తర్వులు ఇస్తాం. ఖబరస్తాన్ కోసం మేడ్చల్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 150 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 112 ఎకరాల భూమికి సంబంధించి రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తాం. పహాడీషరీఫ్ భూముల సంగతి అందరికీ తెలియదు. అవి వక్ఫ్ భూములు. వక్ఫ్ అంటే డొనేషన్. పూర్వం జాగీర్దార్లు, జమీందార్లు, రాజులు వేల ఎకరాలు డొనేట్ (వక్ఫ్) చేశారు. ఏ ఉద్దేశం కోసం? కొంతమంది దవాఖానలు, స్కూళ్లు కడ్తమంటే, సేవా కార్యక్రమాల కోసం భూములు ఇచ్చారు. పహాడీషరీఫ్ వక్ఫ్‌భూముల్లో ఐటీ టవర్స్ కడుతున్నారని నా దృష్టికి తెచ్చారు. అందుకు బదులు వేరే చోట్ల భూములను గుర్తించాం’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.