హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ముఖ్యంగా పేదవారి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న పేదవారి దేవుడు సీఎం కేసీఆర్(CM KCR) అని ప్రశంసించారు.
ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట లో జరిగిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi), షాదీ ముబాకర్(Shadi Mubark)ద్వారా మహిళలను ఆదుకుంటున్నారని, దళిత బంధు(Dalita bandu) ద్వారా దళితులను, ఆసరా పింఛన్ల లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని వెల్లడించారు. ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం 8 సంవత్సరాల లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రశ్నించారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఒక్క నయా పైసా తీసుకురాలేదని ఆరోపించారు. బీజేపీ వాళ్లది శవాల మీద పేలాలు ఏరుకునే రకమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.