గజ్వేల్, సెప్టెంబర్ 13: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో అనేక అద్భుతాలు జరిగాయని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్‌లో 7 లక్షల చేప పిల్లలు, గజ్వేల్‌లో మత్స్యకారులకు ప్రొసీడింగ్ పత్రాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఊహించనంత అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతున్నట్టు చెప్పారు. బీసీల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు తెలిపారు. కుల వృత్తులకు పెద్దపీట వేసి పూర్వవైభవం తెస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా ప్రతిపక్ష నేతలు మాత్రం కండ్లుండి చూడలేని కబోదులుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కాళేశ్వరంలో నీళ్లు లేవని ఆ రెండు పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో నీళ్లే లేకపోతే 3 లక్షల కోట్ల క్వింటాళ్ల ధాన్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతుందని, 50 ఏండ్లు పాలించినప్పుడు ప్రజలకు కరెంట్, నీళ్లు ఎందుకివ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంపదను సృష్టించడం వల్లే ఆర్థికంగా, సామాజికంగా ముందున్నట్టు తెలిపారు. తెలంగాణలో రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న మొనగాడు సీఎం కేసీఆర్ అని, అదే ప్రధాని మోదీ గుజరాత్లో నిరంతర విద్యుత్తు సరఫరా చేసి చూపించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో తాగేందుకు మంచినీళ్లు లేవని అన్నారు. కొండపోచమ్మ సాగర్ మత్స్య సొసైటీ సభ్యులుకు వారంరోజుల్లోనే ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.