రవీంద్రభారతి, అక్టోబర్ 11: రాష్ట్రంలో ఎరుకల సాధికారతకు పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు ఎరుకల జాతి రుణపడి ఉంటుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు ఎరుకల కులస్థులను గుర్తించలేదని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆదివాసీ ఎరుకల కుటుంబాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంను ప్రవేశపెట్టి రూ.60 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే రాములు, జనరల్ సెక్రటరీ లోకిని రాజు, ట్రెజరర్లు కుతాడి రవికుమార్, నరసింహ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు.