హైదరాబాద్‌లో ఇంతటి అద్భుతమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటైతదని ఎవరూ ఊహించలేదు. సంకల్పిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పటానికి సీసీసీ నిదర్శనం. మొత్తం పరిపాలనకు ఇది మూల స్తంభంగా ఉంటుంది. మనం చిత్తశుద్ధితో అనుకొంటే ఏదైనా చేయగలం.సమాజానికి డ్రగ్స్ పెను ప్రమాదం.
అణుబాంబు కన్నా డేంజర్. దీన్ని అరికట్టేందుకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిలబస్‌లో మార్పులు చేయాలి. దీనిపై విద్యావేత్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ భవన నిర్మాణం వెనుకున్న ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్ క్రెడిట్ మొత్తం డీజీపీకే దక్కుతుంది. ఆయన పోలీస్ కమిషనర్‌గా ఉండగా ఈ అద్భుత ఆలోచనకు నాంది పలికారు. డీజీపీ డిసెంబర్లో రిటైర్ అవుతున్నారు. కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉండాలి. మీ డ్రెస్ మారుతుంది.. కానీ సేవ ఇలాగే కొనసాగాలి.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సందర్భోచిత, సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మితమై, దేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ ఓ కలికితురాయి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కమాండ్ కంట్రోల్ సహాయంతో రాష్ట్ర పోలీస్ శాఖ అద్భుతమైన ఫలితాలు సాధించాలని, తద్వారా ప్రజలకు గొప్ప సేవలు అందించాలని ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగంలోని విశేషాలు ఆయన మాటల్లోనే..
నాకో చిన్న కోరిక ఉన్నది. ఎప్పటి నుంచో ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి చెప్తున్నా. తెలంగాణ పోలీసులు సంస్కారవంతమైన పోలీస్‌గా, చక్కటి పోలీస్‌గా పని చేయాలి. సందర్భోచిత, సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మితమై, భారతదేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఓ కలికితురాయి కావాలని కోరుకుంటున్నా. ఎంత విజ్ఞత ఉన్నా సంస్కారం కొరవడితే ఏ మాత్రం బాగుండదు. పాత పద్ధతిలోనే పోలీసులు అనే మాట వినిపించొద్దు. కమాండ్ కం ట్రోల్ సాయంతో పోలీస్‌శాఖ అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు గొప్ప సేవలు అందించాలి. సంస్కారవంతమైన పోలీస్‌గా తయారు కావాలి. ఇదే శాఖలో పదవీ విరమణ చేసిన ఎంతో మంది అధికారులు హైదరాబాద్‌లో ఉండటం మన అదృష్టం. వీరి సలహాలు, సూచనలు తీసుకోవాలి. మీరంతా (రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు) కూడా కమాండ్ కంట్రోల్‌ను సందర్శించి అవసరమైన సలహాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. సీసీసీను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాణ సంస్థలు షాపూర్జీ పల్లోంజీ, ఎల్అండ్టీకి, రోడ్లు భవనాల శాఖకు రాష్ట్ర ప్రజానీకం తరఫున, పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు.
సంకల్పబలానికి ప్రతీక.. సీసీసీ
హైదరాబాద్‌లో ఇంత అద్భుతమైన పోలీస్ కమాం డ్ కంట్రోల్ ఏర్పాటైతదని ఎవరూ ఊహించలేదు. సంకల్పిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పటానికి ఈ సెంటరే నిదర్శనం. మొత్తం పరిపాలనకు సీసీసీ మూలస్తంభంగా ఉంటుంది. మామూలు సమయాల్లో ఒకలా, విపత్తులు సంభవించినప్పుడు మరోలా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎమర్జెన్సీ సెంటర్గానూ వాడుకోవచ్చు. సీసీసీ నిర్మాణాన్ని ముందుగా 24 అంతస్థులు, 9-10లక్షల చదరపు అడుగులు అనుకొన్నాం. డీజీసీఐ అనుమతి ఇవ్వకపోవటంతో 20 అంతస్థులకు పరిమితం చేశాం. నేను ఓసారి వరంగల్ వెళ్లినప్పుడు గుడుంబా గురించి అక్కడి మహిళలు ఏడుస్తూ చెప్పారు. పోలీసులను, కలెక్టర్లను పిలిపించి మన రాష్ట్రంలో గుడుంబా ఉండొద్దని చెప్తే అద్భుత ఫలితాలు సాధించారు. పేకాటను 99 శాతం నిర్మూలించారు. రాబోయే రోజుల్లో సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తాం.
సైబర్ క్రైం కట్టడికి అంతర్జాతీయ విధానాలు
ఇటీవల గోదావరి వరదలు పోటెత్తి భద్రాచలం ప్రాంతం ప్రమాదంలో ఉందంటే నేను, సీఎస్, డీజీపీ, ప్రజాప్రతినిధులు అంతా వెళ్లినం. బస్సులో వస్తున్నప్పుడు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఒక విజ్ఞప్తి చేశా. సైబర్ క్రైంను అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అరికడుతున్నారో తెలుసుకోవాలని చెప్పిన. డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి సైబర్ క్రైంపై స్పెషలైజేషన్ చేయించాలని చెప్పిన. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైం ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తున్నది. ఈ సైబర్ నేరగాళ్లు క్లిష్టమైన నేరగాళ్లు. క్రిటికల్ సబ్జెక్ట్ కూడా.
డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక సిలబస్
సమాజానికి డ్రగ్స్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. భావితరాల బంగారు భవితను నాశనం చేస్తున్నది. డ్రగ్స్ అణుబాంబు కన్నా ప్రమాదం. మానవ జీవితాన్నే చాలెంజ్ చేస్తున్నది. దీన్ని అరికట్టేందుకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిలబస్‌లో మార్పులు చేయాలి. దీనిపై విద్యావేత్తలు కూడా ఆలోచించాలి. నేరాన్ని నియంత్రించాల్సిన పోలీస్‌శాఖ కూడా ప్రధాన పాత్ర పోషించాలి. ఇందుకోసం ఒక ఉన్నతాధికారిని ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ అనే పేరు తెచ్చుకోవాలి.
పోలీసులపై నాకు నమ్మకం ఉన్నది
నేరం చేసే వారు కూడా రూపాలు మారుస్తున్నారు. పట్టణీకరణ పెరిగిపోవటంతో పెద్దపెద్ద నగరాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో డ్రగ్ వ్యవసంతో ఇబ్బంది పడేవారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి మేయర్, పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకొని డ్రగ్స్‌ను 95% తగ్గించేశారు. మనం అనుకుంటే ఇక్కడా అరికట్టగలుగుతాం. మన పోలీసులపై నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నేను కూడా ఎక్కడ మాట్లాడినా మన పోలీసుల గురించి గర్వంగా చెప్తున్నా. పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి.
వర్తమానంలో 50 శాతమే పని చేస్తున్నాం
ఆఫీసుకు వెళ్తుంటే ఎవడో ఒకడు దురుసుగా ఓ మాట అంటే దాని గురించి ఐదు, పది నిమిషాలు ఆలోచించి అక్కడితో వదిలేయం. నన్ను అట్ల అన్నడేంటని సాయంత్రం వరకూ ఆలోచిస్తూనే ఉంటాం. ఏదో అవసరం ఉండి.. మా నాగేందర్ ఓ పది రూపాయలు అడిగితే ఇస్తాలే.. సాయంత్రం రా అని చెప్తే, ఇస్తరంటవా? ఇచ్చేది నమ్మకమే అంటవా? అనే అనుమానాలతో ఆలోచిస్తుంటారు. అంటే మన పనిలో 25 శాతం గతానికి, 25 శాతం భవిష్యత్తుకు పోతున్నది. వర్తమానంలో 50 శాతమే పని చేస్తుంటాం. దీంతో రావాల్సిన ప్రొడక్టివిటీ రాదు.. క్వాలిటీ పోతది. మనం ఏం చేసినా.. రసించి చేయాలని పెద్దలు చెప్పారు. భోజనం చేసినా రసించి చేయాలి అని చెప్తారు. మనం ఏది చేయాలనుకొన్నా చిత్తశుద్ధితో చేయాలి. చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భశుద్ధి, పట్టుదల, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు.
మనిషి ఉన్నంత కాలం పోలీసింగ్ ఉంటుంది
మానవ సమాజం ఉన్నంతకాలం పోలీసింగ్ ఉంటుంది. ఎంత ఉత్తమమైన పోలీసింగ్ ఉంటే ప్రజలకు అంత సేఫ్టీ, సెక్యూరిటీ లభిస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంప్రూవ్మెంట్, రిఫార్మింగ్, అప్డేషన్ పోలీసింగ్ అవసరం. పోలీసుశాఖలో అనేక రకాల సవాళ్లను ఎదుర్కొన్న అధికారులున్నారు. వారి సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేదికాది. మనకు ఉన్నటువంటి గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితరవాటికి ఆనాడే ఎంతో ముంజుచూపుతో బీజాలు వేశారు. మనుషులు తలుచుకొంటే సాధించలేకపోవడం అంటూ ఏమీ ఉండదు. పోలీసు అధికారుల్లో గొప్ప కౌశల్యం ఓర్పు, నేర్పు ఉంటాయి. ఆయా సందర్భాల్లో అవి కనిపిస్తాయి. ఆయా రంగాల్లో, వివిధ హోదాల్లో సమాజహితం కోసం సేవలందించారు.
మాజీ పోలీసు అధికారి రామ్మోహన్రావు ఒక రాష్ర్టానికి గవర్నర్‌గా కూడా సేవలు అందించారు. ఆర్టీసీలో ఇబ్బందులు తలెత్తినప్పుడు పోలీసు సేవలు వాడుకుంటాం. గతంలో నేను రవాణామంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ రూ.13 కోట్లు నష్టాల్లో ఉండేది. అప్పట్లో ఆర్టీసీ ఎండీగా ఉన్న పోలీసు అధికారి అప్పారావుతో కలిసి గట్టిగా కృషిచేయడంతో ఆర్టీసీ రూ.14 కోట్ల లాభాల్లోకి వచ్చింది. మా తర్వాత వచ్చినవాళ్లు సంస్థను ముంచేశారు. పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన పెద్దల వద్ద ఎంతో అనుభవసారం ఉన్నది. వారందర్నీ ఒకసారి భోజనానికి ఆహ్వానించి మరోసారి దీని ఉపయోగాలపై చర్చించి సలహాలు తీసుకోవాలి. మంచి పనికి ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రతిష్ఠలు వస్తాయి. అయితే మన దేశంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వెరీ స్ట్రాంగ్ ఇండివిజ్యువాలిటీలో భారత్ ప్రపంచంలోనే నాలుగో-ఐదో స్థానంలో ఉన్నది. భారతీయుల వ్యక్తిత్వ పటిమ చాలా పటిష్టమైనది. టీమ్ వర్క్‌లో మాత్రం కొన్ని సందర్భాల్లో ఫెయిలవుతాం. మనలో లీకేజ్ ఆఫ్ డైనమిజం ఉంటుంది.
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా రాష్ట్రం
అందరి కంట్రిబ్యూషన్, పోలీసుల పనితీరు, ప్రజ ల సహకారంతో ఎనిమిదేండ్లుగా రాష్ర్టాన్ని శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఊ అంటే, ఆ అంటే చెలరేగే అనేక చిల్లర ప్రయత్నాలన్నీ ఇప్పుడు జరగటం లేదు. భవిష్యత్తులో కూడా జరగొద్దు.. జరగవని ఆశిద్దాం. మనకు ఈ రోజు అద్భుతమైన ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇక నుం చి నేరాలపై మరింత నియంత్రణ పెరిగే అవకాశం ఉన్నది. మేము సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడి పోలీ స్ వ్యవస్థను చూసి రావాలని మహేందర్‌రెడ్డి నాకు చెప్పారు. అక్కడ ఓ సమావేశంలో సింగపూర్ అధికారులు.. మీరు హైదరాబాద్‌ను సింగపూర్ మాదిరిగా ఎప్పుడు చేస్తున్నారు? అని నన్ను అడిగారు. దానికి సమాధానం చెప్తూ ‘మేం ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టినం. కొంత సమయం కావాలి’ అని చెప్పిన. సింగపూర్‌లో అమ్మాయిలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లి పని చేసుకొనే వాతావరణం ఉన్నది. అలాంటి పరిస్థితులు మన వద్ద కూడా రావాలి. అనుకుంటే వస్తాయి. గతంతో పోల్చితే హైదరాబాద్‌లో చాలావరకు నేరాలు తగ్గాయి.
డీజీపీ రిటైరైనా సేవలు వినియోగించుకొంటాం
సీసీసీ నిర్మాణం వెనకున్న ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి. కమాండ్ కంట్రోల్ క్రెడిట్ మొత్తం మహేందర్‌రెడ్డికే దక్కుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఆయన పోలీస్ కమిషనర్‌గా ఉండ గా ఈ అద్భుత ఆలోచనకు నాంది పలికారు. ఇందుకు మేమంతా ఎంతో కష్టపడ్డాం. మహేందర్‌రెడ్డి డిసెంబర్లో రిటైర్ అవుతున్నారు. కానీ, నేను వారికి నిర్మొహమాటంగా చెప్పిన. ‘మీకు డిసెంబర్లో అయితే కావొ చ్చు కానీ, నాకు కాదండీ. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదో రూపంలో మీరు సేవ చేస్తూనే ఉండాలి. మారితే మీ డ్రెస్ మారుతుంది. మీ సేవ మాత్రం ఇలా గే కొనసాగాలి’ అని చెప్పిన. రాష్ట్రంలో మైనారిటీ పిల్ల లు వెనుకబడి ఉన్నారని బాధపడినప్పుడు ఏకే ఖాన్ ఆ బాధ్యతలను తలకెత్తుకొని మైనారిటీ గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. దీనిపై నేను సంతోషం గా ఉన్నా. ఇలా అనేక మంది అధికారులు, అనేక రూ పాల్లో సేవలు అందిస్తున్నారు. ఇదే తరహాలో మహేందర్‌రెడ్డి కూడా సేవలు కొనసాగించాలని కోరా. నా కోరిక మన్నిస్తారనే అభిప్రాయం ఉన్నది. మన్నించకపోతే దినేశ్రెడ్డికో, అనురాగ్శర్మకో లేదా అప్పారావుకో చెప్పి మన్నించే ఏర్పాటు చేస్తా’ అని చెప్పారు.
అద్భుతాల సమాహారం..సీసీసీ
ఒకే చోట లక్షల కెమెరాలు పంపే దృశ్యాలను వీక్షించవచ్చు. కూర్చున్నచోటి నుంచే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు పంపవచ్చు. ప్రకృతి విపత్తు అయినా, సంక్షోభమైనా, భారీ బహిరంగ సభై నా ఇక్కడి నుంచే సిబ్బందిని సమన్వయం చేయవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలను ఏకతాటిపైకి తెచ్చే వ్యవస్థ తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)గా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థ అనేక సాంకేతిక అద్భుతాల సమాహారం.
సీసీసీలోని అద్భుత ప్రయోజనాలు:
సీసీసీలోని ప్రధానమైన విభాగాలు
1. రియల్‌టైం కన్వర్జెన్స్ వింగ్స్:
2. పోలీస్ ఆపరేషనల్ వింగ్స్:
3. పోలీస్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) సపోర్ట్ వింగ్