హైదారాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాట ఫలితంగానే పార్లమెంట్లో బిల్లుకు మోక్షం కలిగిందని బీఆర్ఎస్ ఎన్నారై బృందం ప్రశంసించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో పలు దేశాల ఎన్నారైలు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు సమాన హకులు కల్పించేందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ యూఎస్ఏ సలహాదారు మహేశ్ తన్నీరు, కన్వీనర్ చందు తల్లా, హరీశ్‌రెడ్డి, సురేశ్ తదితరులు అభినందించారు. తెలంగాణ ఉద్యమం, ఉద్యమానంతరం ఎన్నారైలు పోషించిన పాత్ర, భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచార ప్రణాలికను సిద్ధం చేశామని ఎన్నారైలు పేర్కొన్నారు.
మినీ అంగన్వాడీలను గుర్తించింది సీఎం కేసీఆరే:కవిత
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీలను టీచర్లుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను కవిత వారికి అందజేశారు. తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసిన ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులకు వాటా ఇవ్వాలి
సింగరేణి లాభాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా 10 శాతం వాటా కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణు మాధవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్సీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్: కవిత
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ సింగరేణి పక్షపాతిగా నిలిచారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో టీబీజీకేఎస్ సంఘం నాయకులు కవితను బుధవారం కలిశారు. సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆమెకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 18 శాతం బోనస్ ఉండగా 2022 నాటికి 30 శాతానికి పెంచి ఈ సారి 32 శాతానికి పెరగడం పట్ల కవిత హర్షం ప్రకటించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, వరింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.