హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని ఆటోరిక్షా కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అం దించారు. సోమవారం నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పలు హామీలు ఇచ్చారు. ‘ఆటో రిక్షా కార్మికులకు వచ్చే ఆదాయమే తక్కువ. మోదీ సర్కారు డీజి ల్ ధర పెంచడం వల్ల విపరీతంగా దెబ్బతిన్నరు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షాల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులు రద్దు చేశాం. రూపాయి పన్ను కూడా లేదు. వాళ్లకు ఇంకో బాధ ఉన్న ది. ఏడాదికి ఒకసారి రూ.700 పెట్టి ఫిట్నెస్ చేయించుకోవాలి. సర్టిఫికెట్ కోసం రూ.500 మొత్తంగా రూ.1200 చెల్లించాల్సి ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆటోరిక్షాలకు ఫిట్ నెస్, సర్టిఫికెట్ చార్జీలను మాఫీ చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటిం చారు. కరీంనగర్‌కు తనకు ఏదో సుతి ఉన్నదని, ఇక్కడ ఏదో స్కీమ్‌ను ప్రకటిస్తున్నానని, అదే తరహాలోనే ఆటోరిక్షా కార్మికుల కు ప్రకటిస్తున్నానని హామీ ఇచ్చారు. తక్కువ ఆదాయమున్న ప్రతి ఒక్కరికీ సాయం చేసుకుంటూ పోతామని భరోసా ఇచ్చారు.
ఇల్లులేని మనిషి లేకుంట చేస్తం
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రాబోయే రోజుల్లో పేదలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘70-80 ఏండ్ల నుంచి ఎప్పుడు లేనంత సంతోషంగా గత పదేండ్ల నుంచి తెలంగాణ శాంతంగా ఉన్నది. గ్రామాల్లో మంచిగ ఇండ్లు కడుతున్నరు సంతోషం. తర్వాత మేం చేసేది ఏమంటే ఫుడ్ ప్రాసెసింగ్. ఎక్కడిక్కడే యూనిట్లు.. తాలూకాల్లో పెడతం. అక్కడే స్థానికంగా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతయ్. రాబోయే రోజుల్లో ఉద్యోగాల వైపు పోతున్నం’ అని కేసీఆర్ వివరించారు. ‘ఇండ్లు లేనివాళ్లకు ఇల్లు కట్టేది ఉంది. వచ్చే ఐదేం డ్లలో యుద్ధప్రాతిపాదికన డబుల్ బెడ్రూం కానీ, గృహలక్ష్మికానీ కడ్తాం. తెలంగాణలో వడ్లు ఎట్ల పండుతున్నయో ఇండ్ల నిర్మా ణాలు కూడా అట్లనే చేద్దాం. జాగలు లేనోళ్లకు జాగలు, సొంత జాగాలు ఉంటే డబ్బులు ఇద్దాం. ఇండ్లు లేని మనిషి లేకుంట చేద్దాం. ఇండ్లులేని ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టులాగా ఒక టాస్లాగా తీసుకొని, పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని మనవి చేస్తున్నా’ అని భరోసా ఇచ్చారు. ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటీ చేసుకుంటూ ముందుకుపోతున్నామని చెప్పారు.
ఎన్నికల మరునాడే ఆర్టీసీ కార్మికుల రెగ్యులరైజేషన్
‘ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయం. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. ఎప్పుడూ ఒక అభద్రతా భావంలో ఉండేది. వాళ్లను రెగ్యులరైజ్ చేయాలని అసెంబ్లీలో తీర్మా నం చేసినం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ గవర్నర్ వల్ల అది కొంచెం ఆలస్యమైందని చెప్పారు. ఎన్నికలు పూర్తయిన మరునాడే ఆర్టీసీ బిడ్డలను కూడా రెగ్యులరైజ్ చేస్తామని,ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
100శాతం రుణమాఫీ చేస్తాం..
‘కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలె. నేను రైతురుణమాఫీ చేస్తా అని చెప్పి బాజాప్తా చేసిన. కరోనా రావడం వల్ల రాష్ట్ర ఆదాయం ఒక సంవత్సరం సున్నా అయింది. అందుకే లేటైంది. కరోనా దెబ్బతో ఆలస్యమైంది. 90 శాతం అయిపోయింది. ఏనుగు ఎల్లింది తోక చిక్కింది. లక్ష రూపాయలు ఉన్నవాళ్లకు అయిపోయింది. ఆ పైన ఉన్న 4-5 శాతం మందికి మిగిలింది. అది ఇయ్యమా మేము? దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తది కాంగ్రెస్’ అని మండిపడ్డారు. ‘అండ్ల అడ్డంపడ్డది ఎవడు. ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసి ఇయ్యద్దు అని చెప్పి ఆపేసిండ్రు. మళ్ల బజార్లకు వచ్చి ఇంక కాలేదు రుణమాఫీ అని చెప్తున్నరు. 100 శాతం రుణమాఫీ చేస్తాం. దానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సీఎం హామీ ఇచ్చారు.