CM KCR | హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి బుధవారం రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో మెదక్‌కు బయలుదేరిన జననేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదలకు చేరుకొగానే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ బస్ దిగి సీఎం కేసీఆర్ నిమిషంపాటు మాట్లాడారు. అక్కడి నుంచి నర్సాపూర్, కౌడిపల్లి, కోల్చారం, పొతంశెట్టిపల్లి,మంబోజిపల్లి చౌరస్తాల మీదుగా మెదక్ పట్టణానికి చేరుకున్న కేసీఆర్ బస్సుపై గులాబీ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రతి గ్రామంలో ప్రజలు స్వాగతం పలుకగా..సీఎం కేసీఆర్ అందరికీ అభివాదం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా మెదక్ పట్టణం గులాబీమయమైంది. అడుగడుగునా గులాబీ జెండాలు, తోరణాలు, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు, బెలూన్లు ఏర్పాటుచేశారు. పట్టణమంతా గులాబీ వనంగా మారింది.
Medak2
సిద్దిపేట, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్ ప్రగతి శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా ప్రజలు అంచనాలకు మించి సభకు తరలివచ్చారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రాంగణం నిండిపోవడంతో కిలోమీటర్ వరకు జనాలు కనిపించారు. వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఊహించినదానికంటే జనాలు తరలివచ్చారు. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. మండలాల నుంచి ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో సభా ప్రాంగణాల వరకు డోల్ దెబ్బలతో, డప్పు చప్పుళ్లతో గుంపులుగా ప్రజలు వచ్చారు. బీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్.. అని నినదిసతూ సభ స్థలికి చేరుకున్నారు. సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జనాలు కేరింతలు కొట్టారు. పథకాల గురించి చెప్పినప్పుడు జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధరణి ఉండలా.. తీసేయాలా? అని అడిగినప్పుడు ధరణి ఉండాలంటూ రైతులు నినదించారు. ప్రాణం పోయినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టను.. అని సీఎం కేసీఆర్ చెప్పినప్పడు చప్పట్లతో హర్షం ప్రకటించారు. 3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్‌ను బంగళాఖాతంలో పాతరేద్దాం అన్నప్పడు మద్దతు తెలియజేశారు.
Medak3