నమస్తేతెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్ నవంబర్ 5 : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తోపాటు మంత్రుల కాన్వాయ్‌లను చెక్ చేశారు. కొత్తగూడెంలో ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ దిగి తన కాన్వాయ్‌లో వెళ్తుండగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేశారు. సీఎంతో పాటు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలకు సహకరించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ చెక్‌పోస్ట్ వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.
తనిఖీల అనంతరం వారు అక్కడి నుంచి కామారెడ్డి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. తర్వాత కామారెడ్డి పట్టణంలోని ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుంచి పచ్చలనడ్కుడకు వెళ్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వాహనాలను ఎస్సై వినయ్ ఆపి, తనిఖీ చేశారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు.