రాష్ట్రంలో సొంత జాగలో ఇండ్లు కట్టుకునేవారికి నిధులు ఇవ్వాలని నిర్ణయం.. త్వరలో విధివిధానాలు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాబోయే పది నెలలపాటు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో వివరించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అన్ని వర్గాలకు వివరించాలని నేతలకు సూచించారు. ఆఖరు నిమిషంలో ఆపదమొక్కులు మొక్కినట్టు పనులు చేయవద్దని, ఒక క్రమపద్ధతిలో పని చేసుకుంటూ పోవాలని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇస్తామని, ఏ పథకం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలుచేసిన పథకాల వివరాలన్నీ అందిస్తామని పేర్కొన్నారు.
పార్టీ సభ్యత్వం తీసుకొన్న వారి వివరాలను కూడా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలకు అందిస్తామని తెలిపారు. రూపాయి లంచం ఇవ్వకుండా ప్రజలకు పనులు జరిగే జవాబుదారీ వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వివరించారు. ఆసరా పింఛన్లు అయినా, గొర్రెల పంపిణీ అయినా, చేపపిల్లల పంపిణీ అయినా, రైతుబంధు, రైతుబీమా.. ఇలా ఏ పథకమైనా సరే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులు పెట్టుకోకుండా ఇస్తున్నామని తెలిపారు. సాధారణ ఎన్నికలకు, ఉప ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని, జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు.
మళ్లీ మీరే ఎమ్మెల్యేలు..
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్నవారే మళ్లీ ఎమ్మెల్యేలవుతారని, ఎవ్వరినీ మార్చబోవడంలేదని ఇదే సమావేశంలో స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే చెప్పానని, ఇప్పుడు కూడా చెప్తున్నానని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో 95 సీట్లకు తక్కువ కాకుండా గెల్చుకొనేలా ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారు.
ప్రతి ఎమ్మెల్యే మునుగోడులో చేసినట్టు ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్చార్జి ఉండేలా చూసుకోవాలని, వారితో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవాలని కేసీఆర్ చెప్పారు. వంద ఓటర్లకు పెట్టిన ఇన్చార్జి ఫోన్ నంబర్‌ను పార్టీ కార్యాలయానికి కూడా ఇవ్వాలని, తాను కూడా నియోజకవర్గాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని కేసీఆర్ వెల్లడించారు.
ఆత్మీయ సమ్మేళనాలు జరపాలి
పార్టీ, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై కార్యకర్తలు, టీఆర్ఎస్ సానుభూతిపరులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేసుకోవాలని.. ఈ సమ్మేళనాలలో రాజకీయపరమైన చర్చ కూడా ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై కార్యకర్తలు, సానుభూతిపరుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని సూచించారు. ప్రతి పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఒక సమీక్షా సమావేశంలా ఈ సమ్మేళనాలు జరగాలని స్పష్టంచేశారు.
గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకు ఒక విధంగా, పట్టణ, నగర ప్రాంత నియోజకవర్గాలకు ఇంకోవిధంగా సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధి కార్డును తయారు చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం వివరించారు. ‘వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, మానవీయ కోణంలో పాలన అందించడం, శాంతిభద్రతల పరిరక్షణ, పరిశ్రమలను ఆకర్షించడం.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లను అద్భుతమైన ఇంద్రభవనాల్లా నిర్మించాం. వీటన్నింటినీ ప్రజలకు గుర్తు చేయాలి. 8 ఏండ్లలో జరిగిన అభివృద్ధిని సమగ్రంగా వివరించాలి’ అని సీఎం తెలిపారు.
జిల్లా పర్యటనలకు వస్తా..
త్వరలోనే తాను జిల్లాల పర్యటనకు రాబోతున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. జగిత్యాల, నాగర్‌కర్నూలు, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల పర్యటనకు వస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించామని, కానీ, ప్రారంభించుకోలేదని, త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు, సెక్రటరీ జనరల్ కేశవరావు కొన్నింటిని ప్రారంభిస్తారని, తాను కూడా కొన్నింటిని ప్రారంభిస్తానని తెలిపారు.
విమర్శలను సహించొద్దు.. సమర్థంగా తిప్పికొట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ను, పార్టీ నాయకులను ఎవరు విమర్శించినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని, అందరూ కలిసికట్టుగా, సహేతుకంగా, ఆధారసహితంగా దీటైన జవాబు చెప్పాలని సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు సూచించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పనులు చేస్తున్నదని.. కానీ, పనిగట్టుకొని చిల్లర రాజకీయ విమర్శలు చేస్తున్న వాళ్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, కచ్చితంగా తగిన జవాబు చెప్పాలని స్పష్టంచేశారు. పార్టీ నాయకులు ఒకరికొకరు కలిసికట్టుగా ఉండి ఎదురుదాడి చేయాలని స్పష్టంచేశారు.
ప్రతి నియోజకవర్గంలో 500 దళితబంధు యూనిట్లు
దళితబంధు పథకాన్ని అమలు చేయడంపై ప్రతి ఎమ్మెల్యే దృష్టిసారించాలని, 500 మంది లబ్ధిదారులను గుర్తించి, ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూర్చే పథకమని, ఎంపిక చేసే సమయంలో ఈ విషయాన్ని వివరంగా చెప్పాలని సూచించారు. దళితులు ఎలా కోరుకుంటే అలాగే గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ప్రపంచంలో ఈ తరహా అద్భుతపథకం మరెక్కడలేదని సీఎం వివరించారు.