హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్‌వన్ స్థానానికి దూసుకుపోతూ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ధాన్యం, బియ్యం ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ మేరకు రాష్ట్ర మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి సందర్భంగా 2015-17 కాలానికి చెల్లించాల్సిన 2 శాతం సీఎస్టీ బకాయిని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు. బకాయి రద్దుకోసం తప్పనిసరిగా అందించాల్సిన సీ-ఫారం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత వానకాలం సీజన్లో భారీగా ధాన్యం చేతికొస్తున్న నేపథ్యంలో ఎగుమతులను ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
రైతాంగానికి మేలు
దామరచర్ల పర్యటనలో సీఎం కేసీఆర్‌ను మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాసర్‌రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు కలిశారు. సీఎస్టీ బకాయిని రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఇందులో కేవలం రైస్ మిల్లర్ల ప్రయోజనం మాత్రమే లేదని, రైతాంగ ప్రయోజనం ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నందున బియ్యం ఎగుమతులను ప్రోత్సహించటం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు.
తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. రైస్ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎలాంటి సాయం చేయవచ్చో ఆలోచించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. సమస్యను పరిశీలించిన సీఎస్ సోమేశ్‌కుమార్ బియ్యం ఎగుమతికి సంబంధించి సీ-ఫారం తప్పనిసరి కాదని, బదులుగా వే బిల్లులు, లారీ, రైల్వే ద్వారా చేసే రవాణా పర్మిట్ల పత్రాలను కూడా అందజేయవచ్చని సూచించారు. 2015-17 వరకు రెండేండ్ల కాలానికి రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే నల్లమోతు భాసర్‌రావు, రైతు బంధుసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
సీ-ఫారం అందజేత నుంచి మినహాయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయనకు రైస్ మిల్లర్స్ రుణపడి ఉంటారు. సీఎం తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో మేలు చేస్తుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించాం. సమస్య పరిష్కారానికి సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు.
– గంప నాగేందర్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు