NIMS | పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ నలుదిశలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నది. గచ్చిబౌలి, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో నిర్మించనున్న టిమ్స్‌తోపాటు వరంగల్ హెల్త్సిటీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు పేదల దవాఖానాగా పేరొందిన నిమ్స్‌ను భారీగా సైతం విస్తరించాలని నిర్ణయించింది. ఆసుపత్రి విస్తరణకు జూన్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.
ఆసుపత్రి విస్తరణతో 2వేల పడకల సామర్థ్యంతో కొత్తగా మూడు బ్లాక్‌లను నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం నిమ్స్‌లో 1,489 పడుకలు ఉన్నాయి. విస్తరణ తర్వాత 3,489 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఆక్సిజన్ బెడ్లు 1,200, పేయింగ్ రూమ్స్ 300, ఐసీయూ బెడ్లు 500 ఉండనున్నాయి. 33 ఎకరాల విస్తీర్ణంలో రూ.1571 కోట్లతో నిమ్స్‌ను ప్రభుత్వం విస్తరించనున్నది.