నువ్వు మౌనంలో దాక్కుంటే వదిలే సమస్యే లేదు… నేను నీ వెంటబడి తీరుతా.. జవాబులు చెప్పేవరకూ వేటాడుతా…
కేసీఆర్ ఫైటర్.. ఈ వయసులో భయపడే సమస్యే లేదు..నాకు మనీ లేదు.. ల్యాండరింగ్ లేదు.. ఉన్నది సాగుభూమి
ఒక్కడు, ఒకే ఒక్కడు, ఒక బక్కోడు ఓర్పుగా, ఓపికగా, ఒక్కో లెక్కా పక్కాగా విప్పి చెప్తుంటే….
ఉక్కులాంటి గళం నుంచి చిక్కటి చిక్కు ప్రశ్నలు దేశ ముఖచిత్రంపై ప్రశ్న చిహ్నాలై నిలుస్తుంటే…
ముసురుపట్టిన ఆదివారం నాడు పెద్దేకాశి ఒక్కపొద్దు సాయంత్రాన ఆకలి కాదు, ఆలోచన రగిలింది. కడుపులో ఆవేదన కలిగింది!
కేంద్ర ప్రభుత్వ గణాంకాలతోనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరూపిస్తూ.. మోదీ మాటలతోనే ఆయన మాయను పట్టిస్తూ.. బీజేపీ ధర్మం వెనక అధర్మాన్ని ఆవిష్కరిస్తూ… చిల్లర ఆరోపణల వెనకున్న అసలు అల్లరిని చూపిస్తూ..
నా ఈ భారతం ఇలా భారంగా బతకాల్సిందేనా?
నా ఈ దేశం ఇలా దీనంగా కునారిల్ల వలసిందేనా? అంటూ సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలు ఏకాదశి రోజున దైవభక్తితో పాటు, దేశభక్తినీ రగిల్చాయి. ఒక దేశభక్తుని ఆవేదనను మన ముందుంచాయి. మనం ఎంచుకోవాల్సిన మార్గంపై ప్రశ్నల్ని మిగిల్చాయి!
యువజనులారా.. ఈ దేశం మీది
బీజేపీ అరాచకాలను, దుర్మార్గాలను ఇట్లనే భరిస్తూ పోతే ఈ దేశం తప్పకుండా సర్వనాశనమైతది. ఎటూ కాకుండాపోతది. చెడగొట్టడం, కూలగొట్టడం చాలా ఈజీ. పునర్నిర్మాణం చాలా కష్టం. దేశం దెబ్బతింటది. మంచిది కాదు. దయచేసి యువకుల్లారా! ఈ దేశం మీది. భవిష్యత్తు మీది. మీరు కాపాడుకోవాలి. దేశంలో ఉన్న ప్రతి మేథావికి, రచయితకు, కవికి, కళాకారునికి, జర్నలిస్టు లోకానికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. చెడుపై ఎక్కడో చోట పోరాటం మొదలు కావాలి. నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఇండియా రియాక్ట్స్. సందర్భం వచ్చిన ప్రతి సారీ ఈ దేశం రియాక్ట్ అయితది.