CM KCR | రాష్ట్రాన్ని ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా.. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2004లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ధోఖా చేసింది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు అని ఉండేది. ఆయన మాతో మీరు గెలిచారా? మీతోని మేం గెలిచినమా? దమ్ముంటే రుజువు చేయ్ కేసీఆర్ అని సవాల్ విసిరిండు. నేను రాజీనామా చేసి ఆయన మొఖంమీద కొట్టిన. దమ్ముంటే రా నువ్వు.. మీ సంగతి మా సంగతి తేలుతదా అని మొఖాన కొట్టిన. నేను ఎంపీగా మళ్లీ పోటీ చేశాను. సమైక్యవాదుల తరఫున జీవన్‌రెడ్డి నాపై పోటీ చేసిండు. మీరందరూ సాక్ష్యులే. ఆ నాడు 2.50లక్షల మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులేపారు. ఆ పోరాటం మీ కండ్ల ముందే జరిగింది’ అన్నారు.
‘ఎప్పుడూ చరిత్రను చూడండి. తెలంగాణను ముంచింది ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ పార్టే ముంచింది. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏళ్ల దుఃఖానికి ప్రధాన కారణం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉంటే.. ఈ గతి మనకు ఎందుకు అవుతుండే ? ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ? మీ దగ్గరనే ఓ మంచి ఉదాహరణ. వరద కాలువలో బురద లేకుండే కాంగ్రెస్ రాజ్యంలో. ఏమన్నా కొన్ని నీళ్లు వానకు పడితే రైతులు నాలుగు మోటర్లు పెట్టుకుంటే ఆ మోటర్లు ఎత్తుకుపోయి పోలీస్‌స్టేషన్‌లో పెట్టేది. నాలుగు తూములు పెట్టి చెరువులు నింపే పరిస్థితి లేకుండే. నేను ఉద్యమంలో కోరుట్లకుపోయినా, చొప్పదండికి పోయినా, జగిత్యాలకు వచ్చినా ఆ నాడు రైతులకు నాకు రైతులు ఇదే చెప్పేది’ అంటూ గుర్తు చేసుకున్నారు.
‘కాంగ్రెస్ పాలన ఇంత దండిగా ఉండేది. రైతులు మోటర్లు పెట్టుకుంటే వాటిని కోసి కాలువలో వేసేది.. లేకపోతే తెచ్చి పోలీస్‌స్టేషన్‌లో పెట్టేది. అంత గొప్ప దండి కాంగ్రెస్ పాలన. ఆ పాలనను అందరూ యాది చేసుకోవాలి అందరూ. అంటే వాళ్లకు వీళ్లే వంతకొట్టుడు. ఆ రోజు ఉద్యమ స్పీచ్‌లలో నేను చెప్పేది.. కత్తి ఆంధ్రోనిదే కానీ.. పొడిచేటోడు మన తెలంగాణోడేనని. తెలంగాణను ముంచింది మొత్తం నోరుమెదపని కాంగ్రెస్ నేతల చేతగాని తనమే ఆరు దశాబ్దాలు తెలంగాణ ప్రజలను చాలా బాధపెట్టింది. ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్య పరిణితి అంటే అదే. పార్టీల చరిత్రను ఆలోచించాలి. ఏ పార్టీ వైఖరి ఏంటీ? నియ్యతి ఏందీ? ఏం చేస్తరని ఆలోచించాలి. అవకాశ వాదం తప్పా ఆరాటపడి ఎన్నడూ తెలంగాణ కోసం కాంగ్రెస్ పోరాడలేదు’ అన్నారు.