హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పుడున్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల్లో యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు, కిషన్ రెడ్డి పారిపోయిండు. నిజామాబాద్ ఉప ఎన్నికకు వెళ్లి యెండల తరపున ప్రచారం చేశాం. ఆవేశంగా మాట్లాడుతున్నాను. జేఏసీ పిలుపునిచ్చిన కూడా కొందరు దద్దమ్మలు పారిపోయిండ్రు అని అన్నాను. ఒకరిద్దరు పిల్లలు మీ పక్కనే ఒక దద్దమ్మ ఉన్నడు అని చెప్పిండ్రు. అప్పుడు నా పక్కనే కిషన్ రెడ్డి ఉన్నడు.
మేం దద్దమ్మలం కాదు. పదవులను చిత్తుకాగితాల్లాగా విసిరికొట్టినం. ఎన్నో రాజీనామాలు చేశాం. అలా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆర్థిక ప్రగతిలో ముందు వరుసలో ఉన్నాం. ఇండియా మొత్తంలో కరోనా వస్తే ప్రయివేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే. కర్ణాటకలో ప్రయివేటు టీచర్లపై లాఠీఛార్జి చేయించారు. కూలీలను కూడా ఆదుకున్నాం. 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, కూలీలను కడుపులో పెట్టుకుని వారి సొంత ఊర్లకు పంపించాం. కూలీలను గౌరవించింది మేం. కూలీలు టీఆర్ఎస్ జిందాబాద్ అని జై కొట్టారు. పిచ్చి రాజకీయాలు చేసేదీ మీరు అని సీఎం కేసీఆర్ అన్నారు.