వనపర్తి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగువిస్తీర్ణం, వరి దిగుబడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాతీశారు. ఆదివారం ఢిల్లీ నుంచి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకొన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని, రారైస్ మాత్రమే కొంటామని ఎఫ్‌సీఐ పేచీ పెట్టింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారు. వచ్చే సీజన్లో వరి దిగుబడి వివరాలను తెలుసుకొన్నారు. 54 లక్షల ఎకరాల్లో వానకాలం వరి సాగు అయ్యిందని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో 80 శాతం సన్న రకం, 20 శాతం దొడ్డు రకం ధాన్యం ఉంటుందని తెలిపారు. కాగా, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ మొగ్గుచూపిందని, మరో 20 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ఎఫ్‌సీఐని అడిగినట్టు మంత్రి సీఎంతో అన్నారు. వానకాలం సీజన్లో 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పారు. ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేది పోగా మిగిలేది ఎలా అని సీఎం మంత్రిని అడిగారు. కొంత ధాన్యం మిల్లర్లు కొంటారని, మరికొంత ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. మరో 20 లక్షల టన్నులు పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతి అవుతుందని సీఎంకు చెప్పారు. ఎఫ్‌సీఐ పేచిపై పౌరసరఫరాలు, వ్య వసాయశాఖలతో సంయుక్తంగా సీఎం సమీక్షించే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు.