హైదరాబాద్ : బీసీల ఉన్నతి కోసం కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. నేతన్న నేసిన వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందాతనం వస్తుందన్నారు.
విలియమ్స్ హౌవో పిభ్రవరి 28న కుట్టుమిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్లందరికీ గుర్తుంపు లభించిందన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేరు కులస్తులకు హైదరాబాద్ అత్యంత విలువైన ఉప్పల్ భగాయత్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలు కేటాయించిందన్నారు.
బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నత వర్గాలకు దీటుగా బీసీ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామన్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రావు, మేరు సంఘం తెలంగాణ అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, నేతలు దీకొండ నర్సింగరావు, వెంకటేష్ తధితరులు పాల్గొన్నారు.