Telangana | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సంకల్పం.. మంత్రి కేటీఆర్ పట్టుదలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిస్తున్నది. పారిశ్రామీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ పరిసరాలకు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వాటిని జిల్లాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను జిల్లాల్లో ఏర్పాటు చేయడంతో గ్రామాల్లోని రైతులకు నేరుగా లబ్ధిగా జరుగుతున్నది. అన్నదాతలు తమ పంటలను పరిశ్రమలకు విక్రయించడంవల్ల వారికి గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమీషన్ల భారం తగ్గుతున్నది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి.
పారిశ్రామీకరణలో ఆదర్శంగా నిలిచిన మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ గ్రామీణ పారిశ్రామీకరణలో మహబూబాబాద్ జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. మిర్చి పంట దిగుబడిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్నది. ఇక్కడ ఏటా సగటున 1.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నది. ఇది రాష్ట్రంలోని మొత్తం దిగుబడిలో సుమారు 25 శాతంకావడం విశేషం. ఇక్కడి మిర్చికి నాణ్యతలో ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు మద్దతుగా నిలువాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో రెండు భారీ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటునకు చర్యలు తీసుకొన్నది. ఇక్కడ ఏటా ఒక లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల రెండు అతిపెద్ద చిల్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కంపెనీలకు భూ కేటాయింపు, ప్రోత్సాహకాలను అందించడంవంటి చర్యల ద్వారా వేగవంతంగా ప్లాంట్లు ఏర్పాటయ్యేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ రెండు యూనిట్లు మిర్చి నుంచి ఆయిల్‌ను (ఒలియోరెసిన్) తీస్తుండగా.. 85 దేశాలకు ఎగుమతి అవుతున్నది. ఈ రెండు కంపెనీలు కలిసి మొక్క ఆధారిత ఒలియోరెసిన్లో ప్రపంచ మార్కెట్లో 50 శాతం కన్నా ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండడం విశేషం.
రూ.120 కోట్లతో చిల్లీ ప్లాంట్లు
మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో రూ.70 కోట్ల పెట్టుబడితో ‘ప్లాంట్ లిపిడ్స్’ పేరుతో రోజుకు 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మరో కంపెనీ ‘వైద్య హెర్బ్స్’ సైతం రూ.50 కోట్ల పెట్టుబడితో రోజుకు 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల ప్లాంట్‌ను మరిపెడ మండలంలో ఏర్పాటు చేసింది. వైద్య హెర్బ్స్ మరో రూ. 150 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ప్లాంట్ లిపిడ్స్ కూడా విస్తరణ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ భారీస్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు మిర్చి ధరలు స్థిరంగా ఉండేందుకు దోహదపడడంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నేరుగా రైతుల నుంచే పంటను కొనుగోలు చేస్తున్నాయి. చేనువద్దే పంటను కొనుగోలు చేయడంవల్ల రైతులపై రవాణా, మధ్యవర్తుల కమీషన్లు, ఇతరత్రా ఖర్చుల భారం పడడంలేదు. రైతులకు అదేరోజు చెల్లింపులు జరుగుతున్నాయి. అన్నదాతలు మార్కెట్ ధరకన్నా 10-20శాతం అదనపు ధర పొందుతున్నారు. ప్లాంట్ లిపిడ్స్ ఇప్పటివరకు మండలంలో రూ. 100 కోట్లతో రైతులనుంచి 5000 మెట్రిక్ టన్నుల పంటను కొనుగోలు చేసింది. వచ్చే సీజన్లో రెండు కంపెనీలు కలిపి రూ.400 కోట్లతో 20వేల కన్నా ఎక్కువ మెట్రిక్ టన్నులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి.
అన్నదాతల కండ్లల్లో ఆనందం
మహబూబాబాద్ రైతులు సాధారణంగా వరంగల్, ఖమ్మం మార్కెట్లలో తమ పంటను విక్రయించేవారు. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమీషన్లుపోను వారికి చాలా తక్కువ మొత్తంలో డబ్బులు మిగిలేవి. మిర్చి సీజన్లో ఒకేసారి వేలాది టన్నుల మిర్చి మార్కెట్‌కు చేరడంవల్ల ఒక్కోసారి మార్కెట్లోనే రెండు, మూడు రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కొరివి, మరిపెడ మండలాల్లో ఏర్పాటైన చిల్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లతో ఈ రెండు మండలాల్లోని రైతులకు ఎంతో ఊరట లభించింది. రైతులకు అక్కడే గిట్టుబాటు ధర లభించడం, నేరుగా చేనువద్దే పంటను కొనుగోలు చేస్తుండడంవల్ల వారి ఇబ్బందులు తొలగిపోయాయి. నాడు పంట అమ్మేందుకు కన్నీరుకార్చిన అన్నదాతల కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. ఈ ప్లాంట్ల వల్ల స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇటువంటి మరిన్ని ప్లాంట్లు ఏర్పాటుచేస్తే బావుంటుందని రైతులు కోరుతున్నారు.
ఇది తెలంగాణ పారిశ్రామీకరణ విజయగాథ: కేటీఆర్
మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటైన రెండు చిల్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లు తెలంగాణ గ్రామీణ పారిశ్రామీకరణ విజయగాథకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు పరిశ్రమల వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేటీఆర్, కంపెనీల ఫొటోలను కూడా పోస్ట్‌చేశారు. రైతులను ఆదుకొనే లక్ష్యంతో వెనువెంటనే కంపెనీలకు భూ కేటాయింపులు పూర్తిచేసి, ప్రోత్సాహకాలను అందించినట్టు వెల్లడించారు. ఇక్కడి ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 85 దేశాలకు ఎగుమతి కావడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. రెండు కంపెనీలు విస్తరణ బాటలో ఉన్నాయని, దీంతో స్థానికంగా రైతులు, యువతకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.