ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Feb 03, 2020 , 17:58:26

మాజీ మంత్రి సురేందర్‌రెడ్డి అస్తమయం

మాజీ మంత్రి సురేందర్‌రెడ్డి అస్తమయం
  • అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
  • టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సేవలు
  • నేడు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి (78) ఆదివారం మృతిచెందారు. దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న ఆయన యశో ద దవాఖానాలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం, కొర్రెముల గ్రామానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేందర్‌రెడ్డి మృతికి సీఎం కే చంద్రశేఖర్‌రావు సం తాపం వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను అధికారలాంఛనాలతో నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోమవా రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో సురేందర్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 


1981లో కొర్రెముల సర్పంచ్‌గా ఎన్నికైన సురేందర్‌రెడ్డి రాష్ట్రమంత్రిస్థాయికి ఎదిగారు. తెలుగుదేశం పార్టీ లో ఆవిర్భావం నుంంచి పనిచేశారు. 1985లో ఎన్టీరామారావు మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వగా.. భారీ మెజారిటీతో గెలుపొందారు. 1989లో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో అటవీ, పశుసంవర్ధకశాఖమంత్రిగా పనిచేశారు. 1989లోనే జరిగిన ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచే పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్‌ స్థాపించిన టీఆర్‌ఎస్‌లో వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 


2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మేడ్చల్‌ నుంచి పోటీచేసి దేవేందర్‌గౌడ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీకి కూడా రాజీనామాచేసి రాజకీయాలకు దూరం గా ఉంటున్నారు. సురేందర్‌రెడ్డి పెద్దకూతురు విదేశాల్లో స్థిరపడగా.. చిన్నకూతురు ఇటీవల విదేశాల నుంచి వచ్చి మాదాపూర్‌లో ఉంటున్నారు. నాలుగేండ్ల క్రితం భార్య చనిపోవడంతో అప్పటినుంచి సురేందర్‌రెడ్డి చిన్నకూతురు వద్దే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో యశోదలో చేర్పించారు. ఆదివారం కన్నుమూశారు.


సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీమంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. సురేందర్‌రెడ్డి అత్మకుశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.


logo