హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కే చంద్రశేఖర్‌రావు నియమించారు. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డిని, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌ను, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇంతియాజ్ ఇషాక్‌ను నియమించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లపాటు వీరు చైర్మన్లుగా కొనసాగుతారని, సంబంధిత శాఖలు ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రావుల శ్రీధర్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు. 25 ఏండ్ల కిందటే హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆయన ఐసీఐసీఐ సంస్థలో సీనియర్ మేనేజిరియల్ స్థాయిలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2010లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2010లో బీజేపీలో చేరారు. తెలంగాణ పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలను నిరశిస్తూ 2020లో టీఆర్ఎస్లో చేరారు. సామాజిక, రాజకీయ అంశాలపై విస్తృత అవగాహన ఉన్న రావుల, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. క్రీడాకారుడిగానే కాకుండా ఆయా సంస్థలకు చైర్మన్‌గా శ్రీధర్‌రెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా, యోగా అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీ వర్గానికి చెందిన మెట్టు శ్రీనివాస్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ జిల్లావాసి. మైనారిటీ వర్గానికి చెందిన ఇంతియాజ్ ఇషాక్ స్వస్థలం మహబూబ్‌నగర్. ఇషాక్ తొలి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు.
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇంతియాజ్‌ను నియమించడం పట్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన టీఆర్ఎస్ మైనార్టీ నాయకులతోపాటు పలువురు నేతలు హర్షం ప్రకటించారు. కాంగ్రెస్‌లో రాజకీయం జీవితం మొదలుపెట్టిన ఇంతియాజ్.. తెలంగాణ సాధన ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో 2011లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ అప్పగించిన పలు బా ధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. పార్టీకి, ప్రజల కు ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేసీఆర్ రాష్ట్ర కార్యదర్శి గా నియమించారు. 2016, 2020లో జీహెచ్ఎంసీ ఇంచార్జిగా, అసెంబ్లీ ఎన్నికల్లో, వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో, మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతలను ఇంతియాజ్ సమర్థంగా ని ర్వహించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేశారు.