CM KCR Press Meet : భారత రైతాంగం గొప్ప విజయం సాధించిందని.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేడు ముగింపు పలికామని.. దేశ రైతాంగానికి మొత్తం సేఫ్టీ వచ్చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రైతు విజయం అని స్పష్టం చేశారు.
అలాగే.. రైతుల ఉద్యమ సమయంలో చాలామంది రైతులపై కేంద్రం దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టిందని.. రైతుల మీద పెట్టిన అన్ని కేసులను వెంటనే కేంద్రం ఎత్తివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఏదో సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలి. కర్ణాటకలోని బెంగళూరులో ఓ అమ్మాయి రైతులకు సంఘీభావంగా ఓ ట్వీట్ చేస్తే ఆ అమ్మాయిపై కూడా కేసు పెట్టారు. తక్షణమే ఇటువంటి కేసులన్నింటినీ ఎత్తేయాలి. మళ్లీ రైతులను వేధించకూడదు. వెంటనే విత్డ్రా చేసుకోండి అని ప్రధాని మోదీని సీఎం డిమాండ్ చేశారు.
చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం వల్ల 700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్పణం చేశారు. గుండెజబ్బులు వచ్చి.. ఒత్తిడికి లోనయి కొందరు.. ఇతర కారణాల వల్ల కొందరు చనిపోయారు. వాళ్లందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడకూడదు కాబట్టి.. ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత ప్రధాని తీసుకోవాలి.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా చనిపోయిన రైతుల ప్రతి కుటుంబానికి 3 లక్షల సాయం అందిస్తుంది. దాని కోసం రూ..22.5 కోట్లు దానికి ఖర్చు అవుతాయి. రైతు నాయకులను సంప్రదించి.. ఆ కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. అది మామూలు విజయం కాదు. వాళ్లకు నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ల పోరాటాన్ని కీర్తిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలి. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం అందించాలి. కేసులు ఎత్తివేయాలి.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
మేము అడిగేది మూడే. ఒకటి చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు. రెండోది.. రైతులపై నమోదయిన కేసులన్నీ ఎత్తేయాలి. మూడోది.. కనీస మద్దతు ధర చట్టం తీసుకొని రావాలి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ దానిపై పోరాటం చేస్తాం. ప్రతి రైతు అడుగుతున్నది మినిమమ్ సపోర్ట్ ప్రైస్.. మాగ్జిమమ్ సపోర్ట్ ప్రైస్ అడుగుతలేరు. దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు కనీస మద్దతు ధరను డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే ఆచట్టాన్ని పెట్టాలి. మేము కూడా దానిపై పోరాటం చేస్తం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.