పెరిగిన ధరలతో సన్నబియ్యం కొనలేక మనసు చంపుకొని రేషన్ దొడ్డు బియ్యం తింటున్న నిరుపేదల కోసం బీఆర్ఎస్ అధినేత సంచలనాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్న కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి మరో గొప్ప ఆలోచన చేశారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి పెద్దమనసు చాటుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న ధనిక, పేద అనే తేడాలేకుండా అందరి కంచాల్లో ఇక సన్నబియ్యమే ఉండేలా.. సామాజిక విప్లవానికి నాంది పలికారు. కాయకష్టం చేసే నిరుపేద కడుపుమాడ్చుకోకూడదని రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన మాజీ సీఎం ఎన్టీఆర్‌ను తలపిస్తూ కేసీఆర్ మానవత్వం చాటారు. ఒకవైపు దేశంలో కడుపునిండా అన్నమే లేక ఆకలి సూచీలో భారత్ నానాటికీ పతనమవుతుంటే.. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం అన్నం పెడుతానని కేసీఆర్ అనడం తెలంగాణ సాధించిన ప్రగతికి సంకేతం.
దొడ్డు బువ్వ అనంగనే సగం ఆకలి చచ్చిపోతుంది. తినాలని లేకున్నా కాసిన్ని మెతుకులు నోట్లో కుక్కుకోవాలి. సగం కడుపుతోనే కాలం వెళ్లదీయాలి. ఇదీ పేదోడి దుస్థితి. తెలంగాణలోని పేదవాడు కడుపు నింపుకోవటమే కాదు.. సంపన్నులు తినే సన్నబియ్యం తినగలమని రుజువు చేయటమే కేసీఆర్ సంకల్పం. అందుకే మానవీయ దృష్టితో రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. సన్నబియ్యం తొందరగా జీర్ణమై ఆరోగ్యంగా ఉంటారు. పైగా ఇది పౌష్ఠికాహారం కూడా.
CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): పేదోడి ఆకలి తీర్చేందుకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేదోడికి సన్న బువ్వతో కడుపు నిండా భోజనం పెట్టడమే లక్ష్యంగా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో స్పష్టమైన హామీని పొందుపరిచారు. ఈ హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై తమకు దొడ్డు బువ్వ తినే తిప్పలు తప్పుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ హామీతో సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో సామాజిక విప్లవానికి నాంది పలికారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనంగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ హామీ పలు రకాల సమస్యలకు పరిష్కారం చూపనున్నది. ఇటు పేదలకు సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం పెట్టడంతో పాటు, రాష్ట్రంలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్, అక్రమ రవాణా దందాకు ఫుల్‌స్టాఫ్ పడనున్నది.
సన్నాలు కొనుడు బంద్
రాష్ట్రంలో సుమారు 93 లక్షల తెల్ల రేషన్ కార్డులుండగా, ఇందులో 2.90 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రతి నెల ప్రభుత్వం 1.83 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నది. ఇందులో ప్రతినెల 1.40 నుంచి 1.50 లక్షల టన్నుల బియ్యం మాత్రమే లబ్ధిదారులు తీసుకెళ్తున్నారు. మిగిలిన కార్డుదారులు రేషన్ బియ్యం తీసుకోవటం లేదు. తీసుకున్నవారిలోనూ 50 శాతం మందే వినియోగించుకుంటున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలినవారు తాము కొన్న రేషన్‌బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో కిలోకు రూ.6 నుంచి రూ.12 వరకు అమ్మి, బహిరంగ మార్కెట్లో రూ.40 – రూ.60 పెట్టి సన్న బియ్యాన్ని కొంటున్నారు.
ఇలా పేదల ఆకలి తీర్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఇది గండి కొడుతున్నది. పైగా పేదలపై ఆర్థిక భారం పడుతున్నది. ఈ నేపథ్యంలో రేషన్‌లో సన్న బియ్యం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి ఈ హామీని ఇచ్చారు. పైగా, రేషన్ బియ్యం భారీ మొత్తంలో పక్కదారి పడుతున్నదన్న ఆరోపణలున్నాయి. వ్యాపారులు ఈ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొని మిల్లర్లకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్లు ఈ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సీఎమ్మాఆర్లో ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచి ఉన్నాయి. దీనిపై పలుమార్లు ఎఫ్‌సీఐ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు కూడా చెక్ పెట్టనున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే.. వందకు వంద శాతం సన్నబియ్యం పేదోడి ఇంటికే, నోటికే అందుతాయి.
ప్రభుత్వంపై 1,500 కోట్ల అదనపు భారం
పేదల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడని సీఎం కేసీఆర్.. సన్న బియ్యం పంపిణీ నిర్ణయంతో తనేంటో మరోసారి నిరూపించుకున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలన్న హామీతో ప్రభుత్వంపై భారీ మొత్తంలో ఆర్థిక భారం పడనున్నది. అయినప్పటికీ ఆ భారాన్ని భరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సన్న బియ్యం హామీతో ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల అదనపు భారం పడనున్నది. అంటే ఇకపై బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఏటా రూ.5,500 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
పేదల ఆకలితీర్చిన ఎన్టీఆర్
సంక్షేమం అంటే ప్రభుత్వాల భిక్షే అని అనుకొనే రోజుల్లో దాన్ని అన్నార్థుల హక్కుగా మలిచారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం దివంగత ఎన్టీఆర్. చెమట చిందించిన చేతులు అన్నం కోసం దీనంగా చాచకూడదని.. కాయకష్టం చేసే పేదలు కడుపు మాడ్చుకోగూడదని రూ. 2లకే కిలో బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణలాంటి రాష్ట్రంలో అన్నమో రామచంద్రా అంటూ ఎవరూ ఘోషించకుండా మానవీయనిర్ణయం తీసుకొని చరిత్రలో నిలిచిపోయారు.
నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్
పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేసిన నాయకులలో నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్ తప్ప మరో నాయకుడు లేరనే చెప్పుకోవాలి. 1983లో రూ.2కే కిలో బియ్యం పంపిణీ నిర్ణయంతో నాటి సీఎం ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు. ఇప్పుడు సరిగ్గా 40 ఏండ్లకు మళ్లీ పేదల ఆకలి తీర్చేలా సీఎం కేసీఆర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా రేషన్‌గా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. నాడు ఎన్టీఆర్ అమలు చేసిన రూ.2కే కిలో బియ్యం సమాజంలో సామాజికి విప్లవానికి నాంది పలికింది. ఇప్పుడూ కేసీఆర్ తీసుకున్న సన్న బియ్యం పంపిణీ నిర్ణయం మరోసారి సామాజికి విప్లవాన్ని సృష్టించనున్నది. పైగా, సన్నబియ్యం త్వరగా అరగటమే కాకుండా, పౌష్ఠికాహారం కూడా.
సన్నబియ్యం పేదలకు వరం
పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించటం సంతోషంగా ఉన్నది. మా లాంటి పేద కుటుంబాలు ఆకలితో అలమటించవద్దని సన్నబియ్యం పథకంతో మూడు పూటలు కడుపునిండా తినేందుకు అద్భుతమైన పథకం ప్రకటించారు. కేసీఆర్ సార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు ఎంతో భరోసా కల్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం.
– ఆంగోత్ గోపాల్‌నాయక్, మర్రిపల్లితండా, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
సుట్టాలు వచ్చినప్పుడల్లా సన్నబియ్యం తెచ్చుకునేది
నెలకు ఐ దారు కిలోల సన్నబియ్యం కొంటం. ఎ ప్పుడు ఎవలో ఒకరు సుట్టపోళ్లు వత్తరు. వాళ్లకు దొడ్డు బియ్యం పెడితే అయ్యో మీరింకా దొడ్డు బియ్య మే తింటండ్రా అని అంటే మనసు బాధపడేది. గందుకనే సన్నబియ్యం వండి వాళ్లకు పెడుతం. సీఎం కేసీఆర్ సారు సన్నబియ్యం ఇత్తమని చెప్పినప్పటి నుంచి సంతోషమనిపిస్తున్నది.
-అందె శ్యామల గృహిణి, హుస్నాబాద్‌టౌన్, సిద్దిపేట జిల్లా
పేదోడు, ఉన్నోడికి ఒకే బియ్యం
గతంలో ఏ సీఎం మంచిబియ్యం(సన్నబియ్యం) పంపిణీ చేసే ఆలోచన చేయలేదు. సన్నబియ్యం పంపిణీతో పేదోడు, ఉన్నోడు ఒకే రకమైన భోజనం చేస్తారు. వాస్తవం గా మూడేండ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభు త్వం సన్నరకం ధాన్యం పండించాలని గ్రామాల్లో రైతులకు రైతు సమన్వయ కమిటీల ద్వారా సూచనలు చేసింది. ముఖ్యమంత్రి ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ప్రజాసంక్షేమం కొట్టొచ్చినట్టు కనపడుతది.
-బానాపురం వెంకటేశ్, కేసీఆర్ సేవాదళం అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా
కేసీఆర్ సార్, పద్మక్కనే గెలిపించుకుంటం
బీడీలు చేసుకుని బతికే మాకు సీఎం కేసీఆర్ సార్ ఇక నుంచి సన్నబియ్యం ఇస్తడంటే మంచిగనిస్తుంది. ఇంత మంచి సీఎంను మేమెందుకు కాదంటం. కచ్చితంగా ఇప్పుడచ్చే ఎలక్షన్లో మళ్లీ గెలిపిస్తం. మేమంతా పద్మక్కను భారీ మెజార్టీతో ఎన్నుకుంటం. మా గ్రామాలు కూడా పద్మక్క ఎమ్మెల్యే అయినంకనే బాగుపడ్తున్నయ్. గిప్పుడు తెల్లరేషన్ కార్డులవారికి సన్నబియ్యం ఇస్తమంటుండు. కేసీఆర్ సార్నే గెలిపించుకుంటం.
-సార్గు భాగ్యమ్మ, రాయిలాపూర్ రామాయంపేట, మెదక్ జిల్లా