వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 7: రాష్ట్రంలో ప్రతి తల్ల్లి తమ ఇంట్లో రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్టే వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తారని పేర్కొన్నారు. అమ్మ పేరిట అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేశామని, అదేవిధంగా మొక్కలను కూడా అమ్మ పేరిట బిడ్డలు, బిడ్డల పేరిట అమ్మలు రెండు మొక్కల చొప్పున నాటాలని విజ్ఞప్తి చేశారు. మనం మొక్కలు పెంచితే అవే తల్లిలా మన రాష్ర్టానికి ప్రాణవాయువు ఇస్తాయని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే వారికి ఇంటితోపాటు రాష్ట్రంలో, దేశంలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు సమీపంలోని మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సహజ సంపదను నాశనం చేస్తే మరో ఉద్యమం
మొక్కలు నాటడం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సహజ సంపదను నాశనం చేస్తే సహించేది లేదని పలువురు విద్యార్థులు హెచ్చరించారు. సీఎం పర్యటన అనంతరం పలువురు విద్యార్థులు, నాయకులు మొక్కలు నాటిన ప్రాంతాన్ని సందర్శించారు. విస్తారమైన ఈ ప్రాంతంలో అనేక మొక్కలు ఉన్నాయని, వాటిలో సీతాఫల్, చింత, వేప, ఔషధ, మొక్కలతోపాటు పలు అరుదైన జాతులు ఉన్నాయని, ఆయా చెట్లను నరికివేసినట్టు నిజాలు బయటపడితే సంబంధిత అధికారులకు, సీఎంకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సెలవు దినాలు, రాత్రివేళల్లో జేసీబీ లాంటి భారీ యంత్రాలతో పనులు చేపట్టి, పర్యావరణాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు చేయడమేంటని ప్రశ్నించారు.