
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు త్వరలో జిల్లాల పర్యటనలు చేయనున్నారు. వివిధ జిల్లాల్లో సిద్ధమైన సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను, ఇతర ముఖ్య కార్యాలయాలను ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారు కానున్నదని సమాచారం. ఇప్పటికే సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, వరంగల్ కలెక్టరేట్లు, కమిషనరేట్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. త్వరలో మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, జనగామ, పెద్దపల్లి, జగిత్యాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తున్నది. ఆయా జిల్లాల్లో సిద్ధమైన కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 16 వరకు కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనున్నది. కోడ్ ముగిశాక షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశమున్నదని సమాచారం.