హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన, క్రీడల్లో ప్రతిభ చూపిన గురుకుల విద్యార్థులను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఎంసీహెచ్ఆర్డీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో విద్యార్థులు సీఎంను కలిశారు.
ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2026 పోటీల్లో పాల్గొని 4400 మీటర్ల అథ్లెటిక్స్ మహిళల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఎస్సీ గురుకుల క్రీడా అకాడమీ విద్యార్థిని ప్రవళికను సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి విజయేంద్రబోయి, ఎస్సీ గురుకుల కార్యదర్శి శారద, జాయింట్ సెక్రటరీ(అకాడమిక్) సక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.