హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి లేని గొప్పలకు పోయారు. హైదరాబాద్ అభివృద్ధిపై తనదైన రీతిలో అబద్ధాలు మాట్లాడారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచ వ్యాప్తంగా తానే ప్రమోట్ చేసినట్టు చెప్పుకున్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అన్ని విధాలా తానే అభివృద్ధి చేసినట్టు పాత పాట పాడారు. ఓల్డ్‌సిటీ పక్కన ఎయిర్‌పోర్టును దూరదృష్టితో కట్టినట్టు.. పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వేయడంతోపాటు తాను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌లో ముస్లింలు కోటీశ్వరులు అయ్యారని చెప్పుకొచ్చారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్‌సిటీకి వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను ప్రమోట్ చేసినట్టు చెప్పుకున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ పక్కన హోటల్ కట్టించానంటూ డబ్బా కొట్టుకున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఓల్డ్‌సిటీ పక్కన ఎయిర్‌పోర్టు ఎప్పుడు కట్టారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజాం కాలం నుంచే ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీని తాను ప్రమోట్ చేసినట్టు చెప్పుకోవడం,ఓల్డ్‌సిటీలో ముత్యాలకు తానే ప్రాచుర్యం కల్పించానని చెప్పుకోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ గొప్పదనాన్ని చంద్రబాబు తనకు ఆపాదించుకోవడం మానుకోవాలని, లేదంటే ఆయన మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతుందని పలువురు నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.