హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకొని అమాయకుల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడినట్టు ఓ ఫేక్ వీడియో సృష్టించి ఓ లేడీ డాక్టర్ నుంచి ఏకంగా రూ. 20లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 71 ఏండ్ల మహిళా డాక్టర్ మార్చిలో ఓ వీడియోలో మాట్లాడింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అనుకుని ఆ వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసింది. ఆ వెంటనే ఓ వ్యక్తి ఆమెను వాట్సాప్‌లో సంప్రదించాడు. ఆమె వ్యక్తిగత వివరాలతోపాటు ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు వివరాలు రిజిస్ట్రేషన్ కోసం ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత రూ. 20వేలు పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చినట్టుగా నమ్మించారు. ఇది నమ్మిన బాధితురాలు రూ.20,13,305 పెట్టుబడి పెట్టింది. దీనికి రూ.79,850 డాలర్లు బిట్‌కాయిన్ బ్లాక్‌లో ప్రాఫిట్ వచ్చినట్టుగా చూపించారు. బాధితురాలు డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే మరికొంత డబ్బులు చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించింది.