న్యూఢిల్లీ, జూన్ 4: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఏడు నియోజకవర్గాలకు గానూ ఏడింటినీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీకి అడ్డకట్ట వేయలేకపోయాయి. 2014, 2019 ఎన్నికల్లోనూ ఢిల్లీలోని ఏడు స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృతం చేసింది. కొత్త అభ్యర్థులతో రంగంలోకి దింపి విజయాన్ని అందుకుంది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ అభ్యర్థుల మెజారిటీలు మాత్రం భారీగా తగ్గాయి.
న్యూఢిల్లీ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ కూతురు, బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ 78 వేల మెజారిటీతో ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతిపై విజయం సాధించారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి 1.38 లక్షల మెజారిటీతో గెలుపొందారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సానుభూతి ఎన్నికల్లో కనిపించలేదు. ఆయన జైలు నుంచి అనుమతి తీసుకొని వచ్చి ప్రచారం చేసిన తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు.