హైదరాబాద్ సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 6: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ముదిరి పాకానపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్‌కు మద్దతుగా సోమవారం కూకట్పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాలాజీనగర్, బోయిన్పల్లి డివిజన్లకు చెందిన నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి సమక్షంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.
గల్లాలు పట్టుకొని పిడిగుద్దులు కురిపించుకోవడంతో కొందరి తలలు పగిలి రక్తం చిందింది. భోజన బల్లలు చెల్లాచెదురయ్యాయి. దీంతో రాష్ట్ర నేతలు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు మామూలేనని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. స్థానికేతరుడైన బండి రమేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించడమే ఈ గొడవలకు కారణమని తెలుస్తున్నది.