BJP : నల్గొండ జిల్లాలో బీజేపీ (BJP) లో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన 17 మంది సర్పంచ్లకు సన్మానం చేసే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేసింది. దాంతో జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డిపై మరో వర్గం దాడికి పాల్పడింది.
ఈ ఘర్షణ గురించి తెలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్ల కెమెరాలను కొందరు నేతలు లాక్కుని డేటాను డిలీట్ చేశారు. అందుకు నిరసనగా జర్నలిస్టులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.