హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నూతన పారిశ్రామిక విధానంపై వచ్చే రాష్ట్ర బడ్జెట్లో స్పష్టత రానున్నది. అనుమతుల విధానం, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు తదితర అంశాలపై బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించనున్నదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న టీఎస్ ఐపాస్‌కు స్వల్ప మార్పులతో ఈ కొత్త విధానం ఉండనున్నదని చెప్తున్నారు.
నూతన పారిశ్రామిక విధానం విధివిధానాలపై ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వివిధ పరిశ్రమ సంఘాలు, సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పారిశ్రామికరంగ పరిస్థతి, సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు, రాష్ర్టానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ జీవశాస్ర్తాల సదస్సు బయోఏషియా నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గత ప్రభుత్వంలో పెట్టుబడుల వెల్లువ
కేసీఆర్ హయాంలో పారిశ్రామికరంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. టీఎస్ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు జారీచేసి వివిధ రకాల రాయితీలు కల్పించడంతో మరే రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణకు పెట్టుబడులు తరలివచ్చాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం ఇవే రాయితీలను కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రభుత్వం పరిశ్రమలకు ఎటువంటి తాయిలాలు ప్రకటిస్తుందన్న ఆసక్తి పారిశ్రామిక వర్గాల్లో నెలకొన్నది.