మంచిర్యాల, జూలై 9(నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడలో జరుగుతున్న ఘటనలకు తమను బాధ్యులుగా చిత్రీకరించడం తగదని అటవీశాఖ అధికారు లు స్పష్టంచేశారు. పులుల అభయారణ్యం, రక్షిత అటవీ ప్రాంతాన్ని స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తేనే చట్ట పరిధిలోనే అడ్డుకొన్నామని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా కోయపోషగూడ పక్కనే కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో 25 ఎకరాల్లో చెట్లు నరికివేస్తున్నారని, వద్దని వారించిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడిచేశారన్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి చాలాసార్లు గ్రామస్థులకు కౌన్సెలింగ్ చేశామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సీపీ వినోద్‌కుమార్ తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే ఆక్రమణదారులను అడ్డుకొ ని, కేసులు పెట్టాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. కొన్నిసంఘాలు, రాజకీయ పార్టీలు స్థానికులను రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిం చారు. రెండ్రోజుల కిందట రాత్రికి రాత్రి గుడిసెలను ఏర్పాటు చేశారని, తొలగించేందుకు వెళ్లిన తమపై మహిళలను, చిన్న పిల్లలను అడ్డుగా పెట్టి దాడులు చేశారని జన్నారం అటవీ అధికారి మాధవరావు తెలిపారు. కోయపోషగూడ పక్కనే ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోకి చొరబడి కొత్తగా పోడు కోసం అడవిని చదును చేయడంతోనే సమస్య మొదలైందని మంచిర్యాల అటవీ అధికారి శివాని డోగ్రా తెలిపారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి, ఆక్రమించే వారిపై, వారి వెనుక ఉన్నవారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీఎఫ్‌వో స్పష్టం చేశారు.