హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గత ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఎఫ్‌సీఐకి ఇవ్వొద్దని జిల్లా మేనేజర్లు, సివిల్‌సైప్లె అధికారులకు పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు సర్క్యులర్ జారీ చేసింది. గత యాసంగి సీఎమ్మార్ గడువును కేంద్రం మరోసారి పెంచడంతో అప్రమత్తమైన పౌరసరఫరాల సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరి 29తో ముగిసిన గడువును మే 15 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గత యాసంగి సీజన్‌కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ వేలం ద్వారా విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎమ్మార్‌ను జిల్లా అధికారులు ఎఫ్‌సీఐకి అందిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
దీంతో అప్రమత్తమైన పౌరసరఫరాల సంస్థ ఎఫ్‌సీఐకి యాసంగి సీఎమ్మార్ ఇవ్వడాన్ని ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఏయే మిల్లుల్లో ఎంత మొత్తం ధాన్యాన్ని వేలం వేశామో ఇంతకు ముందే సమాచారం అందించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. సదరు మిల్లుల్లోని ఆ కోటా ధాన్యానికి సంబంధించి సీఎమ్మార్ ఇవ్వొద్దని ఆదేశించింది. 2022-23 యాసంగి సీజన్లో 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో ఇప్పటికే 35 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వేలం ద్వారా విక్రయించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 29 వరకు 17.78 లక్షల టన్నుల సీఎమ్మార్‌ను ఎఫ్‌సీఐకి అందజేశారు.