నల్లగొండ : ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి, శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీల నాయకులు, సామాజిక ప్రజా సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ మారణకాండకు వ్యతిరేకంగా స్థానిక నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు, సిపి(ఐ)ఎం పార్టీ ప్రతినిధి చిన్నపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పనిగట్టుకొని హింసకు తెరలేపడం సరైంది కాదన్నారు.
ఈ దేశంలోని అడవులలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను అంతం చేయడానికి పూనుకున్నదని విమర్శించారు. అడవులను కాపాడుతున్న ఆదివాసీలను ఏరివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. దేశ సంపదను కాపాడుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు దుర్మార్గమన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున మాట్లాడుతూ మేధావులు, బుద్ధి జీవుల సూచన మేరకు సాయిధ పోరాటాన్ని ఎంచుకున్న మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
అయినా కూడా గత కొన్ని మాసాలుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వెచ్చించి నరమేధాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. ఆదివాసీల జీవించే హక్కును హననం చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. రాజ్యాంగానికి లోబడి తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించాలని, ఆదివాసీ హక్కులను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుంటే సరిపోదని ఆ రాజ్యాంగంలో ప్రస్తావించబడిన ఆదివాసీ హక్కులను కాపాడే దిశగా తమ గొంతును విప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులుడు పన్నాల గోపాల్ రెడ్డి, సిపిఎంఎల్ (ఎన్.డి.ఆర్)రాష్ట్ర నాయకులు కె.అనంతరెడ్డి, ప్రజాప్రంట్ జిల్లా బాధ్యులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల ఆకాంక్షలు పట్టించుకోకుండా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా సైనిక బలగాలతో మావోయిస్టులను అంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామిక డిమాండ్లను పట్టించుకోకుండా బిజెపి ఏకపక్షంగా ముందుకు పోతున్న విధానం చూస్తే అడవులను, ఆదివాసీలను అన్యాక్రాంతం చేసి ఖనిజ సంపదను వెలికితీయడానికేనని స్పష్టమవుతుందన్నారు. తక్షణమే కర్రెగుటల్లో కూంబింగ్ ఆపివేయాలని ఆదివాసీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, సి.పి.యు.ఎస్.ఐ జిల్లా కార్యదర్శి గద్దపాటి సురేందర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, బొమ్మపాల అశోక్, టీఎస్ యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్.విజయకుమార్, ప్రజా సంఘాల నాయకులు చింతా నరసింహ, ఏడుకొండలు వెంకటేశం, కెవిపిఎస్ నాయకులు బొల్లు రవీందర్, రావుల వీరేష్ తదితరులు పాల్గొన్నారు.