హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో సివిల్ సర్వెంట్లు రావాలని డీజీపీ శివధర్‌రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం తన పోలీసు ఆఫీసర్స్మెస్లో 2025 సివిల్స్ ఫలితాల్లో రాష్ట్రం నుంచి ఎంపికైన విజేతలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 33 ఏండ్ల క్రితం తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినప్పటి పరిస్థితులకు, ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. అభ్యర్థులు పోటీని ఎదురొని విజేతలుగా నిలవడం అభినందనీయమని తెలిపారు. శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ.. తనతోపాటు శైలేంద్ర, కులకర్ణి, అగర్వాల్ వంటి అధికారులు టీం మెంటార్లుగా ఉండి అభ్యర్థులకు వాట్సాప్ గ్రూపులు, జూమ్ మీటింగ్ ద్వారా సూచనలు ఇస్తున్నట్టు తెలిపారు.