హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో జరుగుతున్నవి ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు కావని, ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్లు, ఏకపక్ష దాడులు అని పౌర, ప్రజాహక్కుల సంఘాల నేతలు విమర్శించారు. ఎన్కౌంటర్ల పేరుతో అడవుల్లో సాగిస్తున్న రక్తపాతాన్ని తక్షణం నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని, సమస్య మూలాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో తెలంగాణ పౌర హకుల సంఘం, మానవ హకుల వేదిక, ప్రజాస్వామిక హకుల పరిరక్షణ సంస్థ, పౌరహకుల పరిరక్షణ కమిటీ పౌర హకుల పర్యవేక్షణ కమిటీ నేతలు ప్రొఫెసర్లు హరగోపాల్, గడ్డం లక్ష్మణ్, జయ వింద్యాల, పౌరహక్కుల నేతలు బాలకిషన్, నారాయణరావు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ సహా ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై పౌరులు, ప్రజలు, రాజకీయ పార్టీలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో జరుగుతున్న ఈ బలప్రయోగాన్ని ఇప్పుడు ఆమోదిస్తే, ఇది ఇంతటితో ఆగదని, ఎంతోదూరం వెళ్లే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. సమస్య మూలాల్లోకి వెళ్లకుండా, ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపకుండా, సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎన్కౌంటర్లు చేసుకుంటూ వెళ్తే జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు.
కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలను దారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని, అందులో భాగంగానే మావోయిస్టులను ఏరివేస్తున్నారని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే అజెండా, ఒకే మతం, ఒకే సిద్ధాంతం అనే నినాదంతో బీజేపీ, ఆరెస్సెస్ పనిచేస్తున్నాయని, అందులోభాగంగానే గిరిజనుల మారణహోమానికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. 13 నెలల్లో 344ని మందిని చంపితే.. అందులో అమాయక ఆదివాసీ గిరిజనులు 250 మందికిపైగా ఉంటారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లతో చేసుకున్న 104 ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై హత్యాయత్నం కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా అడవుల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయాలని జయ వింద్యాల కోరారు. పచ్చిన అడవుల్లో రక్తపాతాన్ని ఆపేందుకు సీజ్‌ఫైర్‌ను ఆమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించేవారిని చంపే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను చర్చలకు పిలువాలని, వారితో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి తక్షణం చర్చలు జరపాలని బాలకిషన్ కోరారు. ఐదు దశాబ్దాల పౌరహక్కుల చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. మాజీ మావోయిస్ట్టే మంత్రిగా ఉన్న ములుగు జిల్లాల్లో పౌరహక్కుల నేతల బొమ్మలు దహనం చేయడం దారుణమని నారాయణరావు మండిపడ్డారు. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే ఎంవోయూలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.